మీ ఉడుత ఊపులకు భయపడం | - | Sakshi
Sakshi News home page

మీ ఉడుత ఊపులకు భయపడం

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

అమిత్‌షాపై కేసు పెట్టాలనడం అవివేకం

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

నర్సాపూర్‌: మేధావులుగా చెప్పుకుంటున్న వారి ఉడుత ఊపులకు భయపడేదిలేదని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై కేసు పెట్టాలనడం వారి అవివేకమని పేర్కొన్నారు. ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు తమకు తాము మేధావులుగా ప్రకటించుకొని ఇటీవల ఓ సమావేశం ఏర్పాటు చేసి అమిత్‌షాపై కేసు పెట్టాలన్న వారి ప్రకటనను ఆయన ఖండించారు. కాగా ఆయా రాష్ట్రాల శాసనసభలు, శాసనమండలి, లోక్‌ సభ, రాజ్యసభలకు చెందిన సభ్యులు తమ సభలో హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులపై సైతం తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కును రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో నక్సలైట్లను ఏరివేసేందుకు మార్చి 31 డెడ్‌లైన్‌గా పెట్టి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల పార్లమెంటులో మాట్లాడుతూ 2011లో సుప్రీం కోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు దేశంలో నక్సలైట్లు పెరిగేందుకు దోహదపడేలా ఉందని సభలో చెప్పారన్నారు. కాగా ఆయన వ్యాఖ్యలు తప్పుగా ఉన్నాయని, కేసు పెట్టాలని హైదరాబాద్‌కు చెందిన కొందరు డిమాండ్‌ చేయ డం విచారకరమన్నారు. వాస్తవానికి వారంతా అర్బన్‌ నక్సలైట్లుగా వ్యవహరిస్తున్నారని, మీడియాను సైతం వారు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చౌకబారు ప్రకటనలు చేసి గౌరవాన్ని పోగొట్టుకోవద్దని ఎంపీ వారికి హితవు పలికారు. విలేకరుల సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement