● మంత్రి దామోదరకు పూర్ణకుంభంతో స్వాగతం ● వేలాదిగా హాజరైన భక్తులు
జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలో శ్రీ జోగినాథ రథోత్సవాల్లో భాగంగా మంగళవారం శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక వీరహనుమాన్ దేవాలయం నుంచి శివపార్వతుల విగ్రహాలను ఎండ్లబండిపై ఊరేగింపుగా జోగినాథుడి ఆలయం వరకు తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంలో అలంకరించిన మండపంలో ఆలయ పూజరులు వీరభద్రప్ప, సిద్దేశ్వర్, సుజిత్ స్వాములు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్థానిక వ్యాపారులు పిర్లమర్ల నాగరాజ్, చింతల రాకేష్, సీహెచ్.శివకుమార్ దంపతులు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. వేలాది మంది భక్తులు కల్యాణ వేడుకకు హాజరయ్యారు.
హాజరైన మంత్రి దామోదర
జోగిపేటలోని శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ముందుగా జోడులింగాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాలను కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మంత్రితోపాటు అదనపు కలెక్టర్ పాండు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఎస్.సురేందర్‌గౌడ్, రంగ సురేశ్, పి.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


