● శిశువు మృతి చెందిందని బంధువుల ఆరోపణ ● ఆస్పత్రి ఎదుట ఆందోళన
తూప్రాన్: వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భంలోని శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చెరుకొని బాధితులను శాంతింపజేశారు. వివరాలు ఇలా... మేడ్చల్ జిల్లా కొక్కొండ గ్రామానికి చెందిన మైత్రీ మొదటి కాన్పు కావడంతో తూప్రాన్ పట్టణంలోని ఓ ఆస్పత్రిలో వైద్యం పరీక్షలు చేయించుకుంది. ఈ క్రమంలోనే మార్చి 17న ఆస్పత్రిలో చికిత్స చేసి, స్కానింగ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రసవానికి మరో నెల సమయం ఉందని ఇంటికి పంపించారు. మార్చి 21న కుటుంబ సభ్యులు గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. అప్పటికే గర్భంలో శిశువు మృతి చెందిందని తొలగించకపోతే తల్లి ప్రాణాలకు ముంపు ఉందని తేల్చి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు అంగీకరించడంతో మృతి చెందిన శిశువును వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. కాగా మంగళవారం కుటుంబ సభ్యులు తూప్రాన్‌లోని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం, ఇంజక్షన్ చేయడం ద్వారానే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ వైద్యులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను శాంతింపజేశారు. కాగా ఆస్పత్రి నిర్వాహకులు బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.


