చేర్యాల(సిద్దిపేట): మొక్కజొన్న సాగులో అధిక దిగుబడి సాధించడంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ఆదివారం పట్టణ పరిధిలోని పిల్లి నరేందర్ వ్యవసాయ బావి వద్ద ఏడీఏ రాధిక ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ బయోప్యూయల్ విధానం 2018 ప్రకారం... భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోలు కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. ఇందులో ఆయిల్ కంపెనీలు మిశ్రమ పెట్రోలును విక్రయిస్తున్నాయని తెలిపారు. 2025 నాటికి పెట్రోలులో 25 శాతం ఎథనాల్ మిశ్రమం లక్ష్యంగా నిర్ణయించారని, 2030 నాటికి 30 శాతం మిశ్రమాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ప్రాజెక్టు దేశంలోని 15 రాష్ట్రాల్లో 78 జిల్లాల్లో అమలు చేయబడుతుందని, అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పలువురు రైతులకు మొక్కజొన్న విత్తన సంచులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ భోగేశ్వర్, ఐఐఎంఆర్ ప్రతినిధులు డాక్టర్ ఎన్.సునీల్, ఎం.యాదగిరి. ఎం.కిశోర్ కుమార్, రైతులు పాల్గొన్నారు.


