కంగ్టి(నారాయణఖేడ్): యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చౌకన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై దుర్గారెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మ గణపతి (28) మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి మద్యం తాగిన మత్తులో గొర్ల కొట్టంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.
సైబర్ బాధితులకు రూ. 27లక్షలు అందజేత
మెదక్‌జోన్: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా సైబర్ నేరస్తుల నుంచి రికవరీ చేసిన రూ.27,57,454 జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన 86 మంది బాధితులకు అందించామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 1,188 కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించారని తెలిపారు.
అదుపుతప్పి కారు పల్టీ
ఐదుగురికి స్వల్ప గాయాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): కారు అదుపుతప్పి పల్టీ కొట్టిన ఘటనలో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని జంజారాహిల్స్ తండా సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. కరీంనగర్ నుంచి కుందనవానిపల్లి గ్రామ శివారులోని ఓ తండాలో జరుగుతున్న వార్షికోత్సవానికి వెళ్తుండగా కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రశాంత్ తెలిపారు.


