అధిక సంఖ్యలో హాజరైన భక్తులు
దుబ్బాక: దుబ్బాక మున్సిపల్ పరిధిలోని రేకులకుంట మల్లికార్జున స్వామి, మేడాలమ్మ, కేతమ్మల కల్యాణోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఒగ్గుపూజారుల ఆధ్వర్యంలో మధ్యా హ్నం మల్లన్న, మేడాలమ్మ, కేతమ్మల కల్యాణోత్సవం భక్తుల జయజయ నినాదాల మధ్య కనుల పండువగా నిర్వహించారు. తెల్లవారుజామునే దేవతామూర్తుల ఒగ్గు ప్రార్థనలతో మేల్కొలుపు, పంచామృతాలతో మహాభిషేకం, స్వామి, అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు.
ఎల్లమ్మ జమదగ్నిల కల్యాణోత్సవం
మల్లన్న కల్యాణోత్సవం అనంతరం అక్కడే కొలువుదీరిన రేకులకుంట ఎల్లమ్మ జమదగ్నిల కల్యాణోత్సవం జరిగింది. కల్యాణోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో ఆలయం ఈఓ మారుతి, మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్ దంపతులు, ఒగ్గు పూజారులు, కౌన్సిలర్లు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


