హత్నూర (సంగారెడ్డి): రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వేసిన వరి పంట కళ్ల ముందే ఎండిపోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. మండలంలో ప్రస్తుతం 23,500 ఎకరాల్లో వరి సాగు చేశారు. కాగా సుమారు 5వేల ఎకరాలకు పైగా పంటలు ఎండు ముఖం పట్టాయి. ఎండలు తీవ్రం కావడం, బోర్ల నీరు రాకపోవడంతోపాటు కరెంటు సక్రమంగా లేక తరచూ బోరు మోటార్లు కాలిపోతున్నాయి. దీంతో వరి పంటలు ఎండిపోతున్నాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు పంట చేతికొచ్చే సమయానికి పంట ఎండిపోతుంటే ఏమి చేయాలో తెలియక రైతన్నలు తల్లడిల్లుతున్నారు. మండలంలోని హత్నూర, పన్యాల, సిరిపురం, గిరిజన తండాలతోపాటు పలు గ్రామాల్లో పంటలు తీవ్రంగా ఎండిపోతున్నాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఎండిపోయిన పంటలను అధికారులు గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని పలు గ్రామాల అన్నదాతలు కోరుతున్నారు.
అడుగంటిన భూగర్భ జలాలు
ఆందోళనలో రైతన్నలు


