లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: కలెక్టర్
సంగారెడ్డి టౌన్: జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల పెండింగ్ కేసులకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర, కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ వేదికగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను సులభంగా, వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ఇరువర్గాలు పరస్పరం చర్చించుకుని రాజీకి రావొచ్చని తెలిపారు. దీంతో కోర్టు విచారణలు, దీర్ఘకాల న్యాయ ప్రక్రియల వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. చిన్న వివాదాలపై కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవడం కంటే పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గమని సూచించారు. పెండింగ్ కేసులను గుర్తించి, ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లు ప్రజలకు త్వరితగతిన, తక్కువ వ్యయంతో న్యాయం అందించే సమర్థవంతమైన వేదికలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


