కౌడిపల్లి(నర్సాపూర్): ఉండేందుకు ఇల్లులేదు మేడం. టాపర్‌తో వేసుకున్న గుడిసెలో ఉంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ వెల్మకన్న గ్రామానికి చెందిన కయిత మహేశ్వరీ అనే మహిళ కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను ప్రాధేయపడింది. వెల్మకన్న గ్రామంలో రేషన్ దుకాణం తనిఖీ కోసం కలెక్టర్ రావడంతో విషయం తెలుసుకున్న మహేశ్వరి అక్కడకు చేరుకుని తన గోడు వెళ్లబోసుకుంది. తనకు ఇల్లులేదని భర్త శ్రీను, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ప్రస్తుతం టాపర్‌తో వేసుకున్న తాత్కాలిక గుడిసెలో ఉంటూ కూలీపనులు చేసుకుంటున్నామని వివరించింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సమయంలో తనకు రేషన్‌కార్డులేక ఇల్లు మంజూరు కాలేదన్నారు. ప్రస్తుతం కొత్తరేషన్‌కార్డు వచ్చిందని ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ తాను నివాసం ఉండే గుడిసె ఫొటో, రేషన్‌కార్డును కలెక్టర్‌కు చూపించి ప్రాధేయపడింది. దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించి అధికారులను వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ నవీన్, ఉపసర్పంచ్ ప్రభు ఉన్నారు.
గుడిసె వద్ద భర్త, పిల్లలతో మహేశ్వరీ
అప్పుడు రేషన్‌కార్డులేకమంజూరు కాలేదు
ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది
కలెక్టర్‌ను వేడుకున్న మహిళ


