కొండపాక(గజ్వేల్): గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్లే ఆరోగ్యవంతంగా ఉంటారని ఐసీడీఎస్ చేర్యాల ప్రాజెక్టు సీడీపీఓ రమాదేవి పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండలంలోని మేదినీపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో రిలయన్స్ ఫౌండేషన్, చైల్డ్ రైట్స్ అండ్ యూల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం నిర్వహించిన కళాజాత కార్యక్రమానికి రమాదేవి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్లే అలవాటును నేర్పుతున్నాయన్నారు. ఆటా పాటల ద్వారా పిల్లలు చదువుపై ఆసక్తిని పెంచుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండేలా ప్రతీ నెల బరువును తూకం వేస్తూ లోపాలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగేలా టీచర్లు కృషి చేస్తున్నారన్నారు. అంతకు ముందు కళాకారులు అంగన్‌వాడీ కేంద్రాల ఆవశ్యకతలు, ఫ్రీ స్కూల్ విద్య ప్రాముఖ్యతలపై నృత్యాలు, జానపద గేయాలు, నాటికల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మధుమోహన్, సీడీపీఓ రమాదేవి, సెక్టార్ సూపర్‌వైజర్ మాధవి, ఫౌండేషన్ ప్రతినిధులు భాస్కర్, నవత, గౌతమి, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ చేర్యాల ప్రాజెక్టు సీడీపీఓ రమాదేవి


