● అప్పుడప్పుడు మొరాయిస్తున్న వెబ్‌సైట్ ● అదనంగా స్కిల్డ్ సిబ్బందిని నియమించాలంటున్న వైద్యులు ● పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో అమలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వైద్యారోగ్యశాఖ ప్రారంభించిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌కు అక్కడక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక వెబ్‌సైట్ ఈ–ఆరోగ్యం కొన్నిసార్లు మొరాయిస్తోందని సిబ్బంది పేర్కొంటున్నారు. అలాగే ఒక్కో రోగికి సంబంధించిన సమగ్రమ సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు కనీసం 40 నిమిషాలు సమయం పడుతోందని చెబుతున్నారు. డేటాను ఎంట్రీ చేసే సమయంలో ఇంటర్నెట్ అంతరాయం కలిగితే ఎర్రర్ వస్తోందని, దీంతో కొంత ఇబ్బంది అవుతోందని అంటున్నారు.
రోగుల హెల్త్ ప్రొఫైల్ అమలుకు సంగారెడ్డి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం విధితమే. ప్రయోగాత్మకంగా సంగారెడ్డి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇందుకోసం 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, రెండు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిని ఎంపిక చేశారు. డిజిటల్ ప్రొఫైల్ అమలు చేయడం ద్వారా రోగి ఆరోగ్య చరిత్రతో పాటు, రోగనిర్ధారణ పరీక్షల ఫలితాలు, ఏఏ రోగాలు ఉన్నాయి.. ఇప్పటి వరకు తీసుకున్న చికిత్స.. ఇలా అన్ని వివరాలు ఎక్కడినుంచైనా ఆన్‌లైన్‌లో చూసుకునేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తక్షణం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులకు వీలవుతుంది. ఈ పైలెట్ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు కలెక్టర్ ప్రావీణ్యతో పాటు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టు అమలు తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. అమలులో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వంటి వారి వివరాలను కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీస్తున్నారు.
సిబ్బందిని పెంచితే
మరింత వేగవంతం
రోగుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు మరిన్ని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ వంటి పరికరాలు పెంచాలని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే వివరాల నమోదుకు స్కిల్డ్ సిబ్బందిని అదనంగా నియమిస్తే డేటా ఎంట్రీ మరింత వేగవంతమవుతుందని చెబుతున్నారు. ప్రతి రోజు ఎక్కువ సంఖ్యలో రోగుల వివరాలు నమోదు చేయడం సాధ్యమవుతుందని అంటున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.
ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. పైలెట్ ప్రాజెక్టుకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. టెక్నికల్ సమస్యలు వస్తే వెబ్‌సైట్ సాంకేతిక సిబ్బందితో చర్చించి సరిచేయిస్తున్నాం. ఈ పైలెట్ ప్రాజెక్టు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది.
– డాక్టర్ శశాంక్, ప్రాజెక్టు ఆఫీసర్


