జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని
సంగారెడ్డి జోన్: సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందేలా చూడాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని సూచించారు. బుధవారం జిల్లా పర్యటన సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, శిశు సంక్షేమ శాఖల, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న వసతి సౌకర్యాలు, మౌలిక వసతులు, బోధన ప్రమాణాలు, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయభారతి సయాని మాట్లాడుతూ..శిథిలావస్థలో ఉన్న భవనాలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వసతి గృహాల్లో పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పోక్సో కేసులు, మానవ అక్రమ రవాణా, నేరాల నియంత్రణపై చర్చించారు. ల్యాండ్ మేనేజ్మెంట్ చట్టాల అమలు, మధ్యాహ్న భోజనానికి బియ్యం సరఫరా వంటి అంశాలపై రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అధికారులు లలితకుమారి, జగదీశ్, అఖిలేశ్‌రెడ్డి, డీఎస్పీ సత్తయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బడ్జెట్
రూ.40.31కోట్లు
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.40.31 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బుధవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ వివరాలను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ విమల చదివి వినిపించారు. మున్సిపాలిటీకి అంచనా ఆదాయం రూ.40.31 కోట్లుగా, వ్యయం రూ.39.88 కోట్లుగా చూపి.. మిగులు రూ.49.63 కోట్లుగా ఉంటుందని వెల్లడించారు. బడ్జెట్ నిధులను ప్రాధాన్యత రంగాలకు ఖర్చుపెడతామని చైర్‌పర్సన్ తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, వైస్ చైర్‌పర్సన్ కళ్యన్‌కర్ పద్మాబాయి, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


