జహీరాబాద్: కోహీర్, జహీరాబాద్ మండలాల్లో ఆలుగడ్డ పంటను సాగు చేసిన రైతులు పంట మార్కెట్లో అమ్ముడు పోక ఆగమవుతున్నారని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో మాట్లాడారు. ఆయా మండలాల్లో ఎర్రనేలలు అధికంగా ఉండడంతో రైతులు సాంప్రదాయంగా అత్యధిక విస్తీర్ణంలో ఆలుగడ్డ పంటను పండిస్తూ వస్తున్నారన్నారు. ప్రస్తుతం రైతులు పండించిన పంటను హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లితో పాటు పాతనగరం తదితర మార్కెట్లకు తరలిస్తున్నారని తెలిపారు. అక్కడ అమ్ముడు పోక పారవేసి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నష్టాల పాలవుతున్నారన్నారు. అల్లం పంట పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందన్నారు. మార్కెట్లో ధర లేనప్పుడు రైతులు ఆలుగడ్డ, అల్లం పంటతో పాటు పసుపు పంటను నిల్వపెట్టుకునేందుకు వీలుగా జహీరాబాద్, కోహీర్ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజీలను నిర్మించి ఇవ్వాలని కోరారు. అలాగే జహీరాబాద్ నియోజకవర్గంలో చెరకు పంటను అత్యధికంగా విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారని, అవసరం మేరకు డ్రిప్ సరఫరా కావడం లేదన్నారు. రైతాంగానికి డ్రిప్ పరికరాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆవేదన


