పటాన్‌చెరు: ప్రజావాణి ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం పటాన్‌చెరు, అమీన్‌పూర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. పటాన్‌చెరు పరిధిలోని పాటి, ఘనాపూర్‌లోని ఆనందనగర్ లేఅవుట్‌ను సందర్శించారు. రహదారులు, పార్కులు, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాల ఆక్రమణలను పరిశీలించారు. ధరణి ద్వారా పాస్‌బుక్స్ సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులపై బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. లేఅవుట్ ప్రకారం పార్కులు, రహదారులను గుర్తించి ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించిన ఆయన, ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. అనంతరం బీరంగూడలోని శంభుని కుంట అవుట్‌లెట్లను పరిశీలించారు. వరద కాలువలను మూసివేసి నిర్మాణాలు చేపడుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద కాలువలను పునరుద్ధరించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలన్నారు.


