ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి
సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్
ములుగు(గజ్వేల్): రాజీవ్ రహదారిపై వెళ్లే ప్రయాణికులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని వంటిమామిడి వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్ పరిసరాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, వాహన రాకపోకల క్రమబద్ధీకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మార్కెట్ కమిటీ ప్రతినిధులు, వర్తకులు, పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మార్కెట్‌కు వచ్చే భారీ వాహనాలు, లారీలు రాజీవ్‌రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లో నిలపాలని సూచించారు. అక్రమ పార్కింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, రూరల్ సీఐ రవిరాజు, ములుగు ఎస్‌ఐ రఘుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయమోహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్‌గుప్త, డైరెక్టర్లు నర్సారెడ్డి, శశికాంత్‌రెడ్డి, రాజీవ్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు.


