నష్టాల బాటలో టమాటా
పెరిగిన పెట్టుబడులు నష్టపోతున్న రైతులు
ఉద్యాన పంటగా.. టమాట సాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. నెల క్రితం రూ.50 పలికిన టమాట ప్రస్తుతం రూ.పదికి మించి కొనడం లేదు. కనీసం పెట్టుబడి కూడా దక్కడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ టౌన్:
జిల్లా నేలలు, వాతావరణం టమాట సాగుకు అనుకూలంగా ఉంది. మిగతా కూరగాయలతో పొల్చితే టమాట అధిక విస్తీర్ణంలో రైతులు పండిస్తున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, మనూర్, న్యాల్‌కల్, కోహీర్, కొండాపూర్, ఝరాసంగం తదితర మండలాల్లో అధిక విస్తీర్ణంలో టమాట సాగవుతుంది. జిల్లాలో ఈ ఏడాది సుమారు వెయ్యి ఎకరాల్లో టమాట పంట ఉంటుంది. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి. జహీరాబాద్ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో టమాట రావడంతో ధరలు బాగా పడిపోయాయి. మహారాష్ట్రలోని షోలాపూర్, కర్ణాటక రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి అందుతుండటం వల్ల ధరలు పతమనమయ్యాయి. జహీరాబాద్ మార్కెట్‌కు భారీగా టమాట వస్తోంది. డిమాండ్ కన్నా దాదాపు రెట్టింపు రావడం వల్ల ధరలు పడిపోయాయి. నెల రోజుల క్రితం కిలో రూ.50 అమ్ముడుపోయింది. ప్రస్తుతం రూ.పదికి ఎవరు కొనడానికి ముందుకు రావడంలేదు. ధరలు తగ్గడం వల్ల వినియోగదారులకు మేలు జరిగినా రైతులు మాత్రం నష్టపోవాల్సి వస్తోంది.
పడిపోయిన ధరలు
రెండేళ్లనుంచి నష్టాలే..
టమాట పంటను గత నాలుగేళ్ల నుంచి పండిస్తున్నాను. టమాట పండించి ప్రతీసారి నష్టపోయా. హోల్‌సెల్ మార్కెట్‌లో 22 కిలోల బరువున్న బాక్స్ రూ.100కు అమ్ముడుపోతుంది. కూలీలు, ఆటో చార్జీలు, కమిషన్ చార్జీలు ఖర్చులు పోనూ చేతికి ఏమీ మిగలడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే టమాట రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి.
– తెలుగు శ్రీనివాస్, రైతు, కంబాలపల్లి
నష్టాల బాటలో టమాటా


