62% పన్ను వసూలు
● ఈ నెలాఖరు నాటికి శతశాతం పూర్తి!.. ● జిల్లాలో 613 పంచాయతీలు
న్యాల్‌కల్(జహీరాబాద్): జిల్లాలో ఇంటి పన్నుతోపాటు ఇతర పన్నులు వసూలు చేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇదే జోరు కొనసాగితే అధికారుల నిర్ణయించిన శతశాతం పన్ను వసూలు లక్ష్యం ఈ నెలాఖరు నాటికే పూర్తయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 62% పన్ను వసూలైనట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో వసూలు చేసిన మాదిరిగా పన్నులను నిర్ణీత సమయానికంటే ముందే పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పన్నుల వసూలుపై దృష్టి సారించారు.
25 మండలాలు.. 613 గ్రామ పంచాయతీలు
జిల్లాలో 25మండలాలు, 613 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.20,30,80,690 పన్నులు వసూలు చేయవలసి ఉండగా ఇప్పటివరకు జిల్లాలో రూ.12,51,24,027 (62%) పన్నులు వసూలైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని 25 మండలాలు ఉండగా అందులో రాయికోడ్, కంగ్టి, మొగుడంపల్లి, వట్‌పల్లి, నిజాంపేట్, పటాన్‌చెరువు, జహీరాబాద్‌లో 70%కు పైగా పన్నులు వసూలు కాగా, మిగిలిన మండలాల్లో 70%లోపు పన్నులు వసూలయ్యాయి. నిజాంపేట్, పటాన్‌చెరువు, జహీరాబాద్ మండలాల్లో అధికంగా వసూలయ్యాయి.
ఖాతాల్లో జమ
వసూలు చేసిన పన్నులను పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రజలంతా ఇంటి పన్నుతోపాటు ఇతర పన్నులు తప్పకుండా కట్టాలని, పన్నులు కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో చాటింపు వేయించారు. వసూలు చేసిన సొమ్మును ఎప్పటికప్పుడు బ్యాంక్‌ల ద్వారా పంచాయతీల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. వసూలు చేసిన పన్నులతో ఆయా గ్రామాల్లో మంచి నీటిట్యాంక్‌లు, మురికి కాల్వలను శుభ్రం చేయించడం, పగిలిన పైప్‌లైన్‌లకు, లీకేజీల మరమ్మతులు చేయించడం, వీధి దీపాలను ఏర్పాటు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. పన్నుల వసూలుకు ఇంకా 40 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అంతలోపు వంద శాతం పన్నులను కచ్చితంగా వసూలు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.


