తగ్గిన పత్తి కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

తగ్గిన పత్తి కొనుగోళ్లు

Feb 21 2026 8:54 AM | Updated on Feb 21 2026 8:54 AM

తగ్గిన పత్తి కొనుగోళ్లు

తగ్గిన పత్తి కొనుగోళ్లు

గతేడాది కంటే తగ్గిన 30% 2024–25లో 14.13 లక్షలక్వింటాళ్ల సేకరణ వర్షాలతో పంట నష్టం.. తగ్గిన దిగుబడి ఈసారి నుంచే అమలైన యాప్‌లోస్లాట్‌ బుకింగ్‌ విధానం

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. గతేడాది కంటే ఏకంగా సుమారు 30% తగ్గిపోయాయి. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) జిల్లాలో గతేడాది (2024–25 కొనుగోలు సీజను)లో 51,086 మంది రైతుల వద్ద 14.13 లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించింది. ఈసారి మాత్రం 54,240 మంది రైతుల వద్ద 10.01 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగింది. రైతుల సంఖ్య పెరిగినా కొనుగోళ్ల పరిమాణం పడిపోవడం గమనార్హం. జిల్లాలో పత్తి సేకరణ ముగించినట్లు ఇటీవల సీసీఐ ప్రకటించింది. గత ఖరీఫ్‌ పంట సీజనులో జిల్లాలో 3.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగైన విషయం విదితమే. గతేడాదితో సమానంగా పత్తి మార్కెట్‌లోకి వస్తుందని అంచనా వేశారు. కానీ కేవలం 10.01 లక్షల క్వింటాళ్లకే పరిమితం అయింది. సీసీఐ ఈసారి జిల్లావ్యాప్తంగా 24 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జిన్నింగ్‌ మిల్లులను లీజుకు తీసుకుని ఆయా మిల్లుల్లో పత్తి సేకరించింది.

పడిపోయిన దిగుబడులే కారణమా?

పత్తి దిగుబడులు భారీగా పడిపోయాయి. ఎకరానికి 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లు రావాల్సిన పత్తి కేవలం ఆరు క్వింటాళ్లు, ఏడు క్వింటాళ్లకు మించి రాలేదు. అధిక వర్షాలే ఇందుకు కారణం. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కురిసిన భారీ వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పత్తికి బాగా నష్టం వాటిల్లింది. భారీ వర్షాల వరద నీటిలో పంట మునిగిపోవడంతో మొక్కలు ఎర్రబడటం, పత్తి కాయలు దెబ్బతినడం జరిగింది. దీని ప్రభావం దిగుబడులపై పడింది. ఈ కారణంగానే మార్కెట్‌లోకి పత్తి రాక తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. కొంత ప్రైవేటు వ్యాపారులు కూడా పత్తిని కొనుగోలు చేశారు. క్వింటాళ్లు, రెండు క్వింటాళ్లు ఇలా తక్కువ పరిమాణంలో పత్తిని అమ్మిన వారి వద్ద వ్యాపారులే కొనుగోలు చేశారు. కూలీల ఖర్చుల కోసం, తక్షణ ఆర్థిక అవసరాల కోసం చాలామంది రైతులు క్వింటాళ్లు, రెండు క్వింటాళ్లు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు.

సీసీఐ కొన్నది 10 లక్షల క్వింటాళ్లే

యాప్‌ ద్వారా స్లాట్‌ విధానం..

సీసీఐ పత్తి ఈ కొనుగోలు విధానంలో ఈ సీజనులో కీలక మార్పులు చేసింది. కపాస్‌ కిసాన్‌ పేరుతో ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభంలో రైతుల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. స్మార్ట్‌ ఫోన్లలో ఈ యాప్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ చేసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. కానీ స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడం ద్వారా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు పడిగాపులు చాలా మట్టుకు తగ్గాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో పత్తి తూకం అయ్యే వరకు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సివచ్చేది. ఈసారి ఈ సమస్య తగ్గిందనే అభిప్రాయం మార్కెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు సీసీఐ ఎకరానికి ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని పరిమితి విధించింది. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎకరానికి 12 క్వింటాళ్లకు పెంచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement