మల్లన్న జాతర నిర్వహణ భేష్: సునీతారెడ్డి
హత్నూర (సంగారెడ్డి): మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీతారెడ్డి పేర్కొన్నారు. హత్నూర మండలం రొయ్యపల్లి గ్రామ శివారులోని మల్లన్న జాతర ఉత్సవాలలో సునీతారెడ్డి శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి మల్లన్న జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమాలలో సర్పంచ్ పోచగౌడ్, మాజీ ఎంపీపీ నర్సింహులు, నాయకులు నరసింహారెడ్డి, ఆగమయ్య, సురేశ్, కిశ్‌ర్‌తోపాటు పలు గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.
మల్లికార్జునస్వామి హుండీ ఆదాయం రూ.8.62లక్షలు
పటాన్‌చెరు టౌన్: అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని బీరంగూడ గుట్టపై నెలకొన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి దేవస్థానం 43 రోజుల హుండీ ఆదాయం రూ.8,62,677 వచ్చింది. ఆలయంలోని హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు, ఈవో శశిధర్‌గుప్తా, ఆలయ చైర్మన్ సుధాకర్ సమక్షంలో నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఐదు రోజులపాటు అమ్మిన దర్శనం టికెట్లు, టెండర్లు, అన్నదానానికి భక్తులు అందించిన విరాళాలు కలిపి మొత్తం రూ.80,92,132 వచ్చినట్లు తెలిపారు.
ఫ్రిజ్, ఏసీ రిపేరింగ్‌లో
ఉచిత శిక్షణ
సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఫ్రిజ్, ఏసీ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేశ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 6 నుంచి అందించనున్న ఉచిత శిక్షణకు 19 నుంచి 45 ఏళ్ల లోపు వయసువారు అర్హులని ఆసక్తి గలవారు 94901 03390, 94901 29839 నంబర్‌లకు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
విద్యారంగ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు
జహీరాబాద్ టౌన్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్న విద్యారంగ సమస్యలను పట్టించుకోవడంలేదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా 8వ మహాసభలు శుక్రవారం జహీరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి బీబీ ఫంక్షన్‌హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సభలో నాగరాజు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ హాయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. రెండేళ్లనుంచి ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలకు సొంత భవనాలు లేక విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడు తామని హెచ్చరించారు. సభలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహేశ్,రాజేశ్ నాయకులు అర్జున్, సతీశ్, పావని పాల్గొన్నారు.
మల్లన్న జాతర నిర్వహణ భేష్: సునీతారెడ్డి


