పాంచ్ పటాకాతో ఫుల్‌జోష్
ఈసారి జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా బీఆర్‌ఎస్ వ్యూహరచన
మున్సిపాలిటీల విజయంతో పుర గులాబీ కేడర్‌లో నూతనోత్సాహం
రామచంద్రాపురం (పటాన్‌చెరు): పటాన్‌చెరు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపాలిటీలకు ఐదింటిని బీఆర్‌ఎస్ కై వసం చేసుకోవడంతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్ నేతలు ప్రణాళికబద్ధమైన ఎన్నికల ప్రచారం, సామాజిక సమీకరణలు, అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ బీఆర్‌ఎస్ విజయానికి తోడ్పడ్డాయి. వీటికి తోడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సైతం రంగంలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపునిచ్చింది. దీంతో అధికార పార్టీ ఆత్మ పరిశీలనలో పడింది.
జీహెచ్‌ఎంసీ దిశగా దూకుడు..
నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే జోరును కొనసాగించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలో మూడు డివిజన్లు ఉండగా ప్రస్తుతం వాటిని కలుపుకుని 9 డివిజన్లు అయ్యాయి. దీంతో గెలిచే వారికే టికెట్ ఇవ్వాలన్న నియమాన్ని అమలు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.
ప్రధాన శాఖలలో కదలికలు!
ఎన్నికల ఫలితాల ప్రభావం రాజకీయాలకే పరిమితం కాకుండా పరిపాలన వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. కొంతమంది అధికారుల బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయన్న తెలుస్తోంది.
ముందున్న సమరం
మున్సిపల్ విజయాలను నగర రాజకీయాల్లోకి మలుచుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుండగా, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ ఇప్పటినుంచి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇరు పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పోటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో డీలా పడటంపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలనలో పడ్డారు. పటాన్‌చెరు నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.


