పైసలు పాయె.. పదవీ దక్కకపాయె | - | Sakshi
Sakshi News home page

పైసలు పాయె.. పదవీ దక్కకపాయె

Feb 19 2026 11:01 AM | Updated on Feb 19 2026 11:01 AM

పైసలు పాయె.. పదవీ దక్కకపాయె

పైసలు పాయె.. పదవీ దక్కకపాయె

ఓటమి చెందిన అభ్యర్థుల మనోవేదన

మున్సిపల్‌ ఎన్నికల్లో పైసలన్నీ పాయె.. పదవీ దక్కకపాయె.. అప్పుల కుప్పాయె.. అంటూ కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. చేసిన అప్పులను ఎలా తీర్చేది అంటూ లోలోపల కుమిలిపోతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఒక్కో అభ్యర్థి దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు వెచ్చించినట్లు సమాచారం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 19 మున్సిపాలిటీలలో 402 వార్డుల్లో 1,658 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 402 మంది కౌన్సిలర్లుగా విజయంసాధించగా, 1,256 మంది ఓటమి పాలయ్యారు.

– సాక్షి, సిద్దిపేట

ట్టణంలో కౌన్సిలర్‌గా పని చేయాలనేది కొందరికి మోజు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో కార్యకర్త, నాయకుడిగా కొనసాగుతున్న వారు ఈసారి మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా రిజర్వేషన్‌ కలిసి వచ్చిందని చాలా మంది పోటీ చేశారు. రాజకీయ నేత ఎదగడానికి కౌన్సిలర్‌ తొలి మెట్టు అవుతుందని బరిలో దిగారు. అందులో ఆయా వార్డుల్లో ఎక్కువ ఓట్లు సాధించిన వారికి విజయం వరించింది. తక్కువ ఓట్లు వచ్చిన వారు ఓటమి చెందారు. కొందరు సొంత డబ్బులు.. మరి కొంత మంది తమ దగ్గర ఉన్న డబ్బులతో పాటు అప్పులు తెచ్చారు. అలాగే భూములను విక్రయించడం.. తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఎన్నికల్లో వెచ్చించారు. నామినేషన్‌ వేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే రోజు వరుకు చేసిన ఖర్చు అంతా ఇంతా కాదు.. ఓటమి చెందడంతో అప్పులు పెనుభారంగా మారాయి.

విచ్చలవిడిగా వెచ్చింపు..

గెలుస్తామని ధీమాతో కొందరు అభ్యర్థులు విచ్చలవిడిగా వెచ్చించారు. విందులు, వినోదాలు, గిఫ్ట్‌లతోపాటు ఓటర్లకు నేరుగా రూ.1,000 నుంచి రూ.10వేల అందించినట్లు తెలిసింది. కొందరు స్థిరాస్తులు అమ్ముకోగా, మరికొందరు భూములు తాకట్టు పెట్టి, మరికొందరు నేరుగా అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా డబ్బులు ఖర్చు చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో వెనకడుగు వేయకుండా డబ్బులు తీసుకవచ్చి వెచ్చించారు. ఓటమి చెందగానే చేసిన అప్పులు గుర్తు తెచ్చుకుని ఆందోళన చెందుతున్నారు. ఓటమి పాలైన కౌన్సిలర్‌గా పోటీ చేసిన అభ్యర్థులు తెచ్చిన అప్పులకు నెలనెలా వడ్డీలు ఎలా కట్టాలి? అసలు అప్పు తీర్చేది ఎలా అని పలువురు తలలు పట్టుకుంటున్నారు.

ఐదు మున్సిపాలిటీలలో అధిక ఖర్చు

హైదరాబాద్‌ మహానగరానికి సమీపంలో ఉన్న పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్‌, గుమ్మడిదల, ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం పురపాలక సంఘాల్లో అభ్యర్థులు అధికంగా ఖర్చు చేశారు. వీటిలో మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలబడిన ఒక్కో అభ్యర్థి దాదాపు రూ.70 లక్షల నుంచి రూ.2 కోట్లకు పైగా వెచ్చించినట్లు ప్రచారం జరిగింది. దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌లలో ఒక్కో ఓటుకు కొన్ని వార్డుల్లో రూ.5వేల వరకు డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తమ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు కింద కొంతమేర డబ్బులతో పాటు ప్రచార సామగ్రిని అందజేసినట్లు సమాచారం. కొన్ని చోట్ల ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం కొంత వరకు కార్నర్‌ సమావేశాలకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

గెలుపు ధీమాతో పోటాపోటీగా ఖర్చు గరిష్టంగా రూ.2కోట్లకు పైగా వెచ్చింపు

అప్పులు ఎలా తీర్చేదంటూ ఆవేదన ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,256 మంది ఓటమి

ఓటమి చెందిన అభ్యర్థులను ఆయా ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కనీసం పలకరించకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. బరిలో నిలిచి ఓటమిని చవిచూసిన అభ్యర్థులకు సొంత పార్టీ నేతలు ఓదార్చకపోవడంతో మరింత కుమిలిపోతున్నారు. రాజకీయ భవిష్యత్తు ఎమిటని తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును చూస్తే పేదోడు రాజకీయాలలో ఉండటం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతుండటం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement