వైభవంగా విమాన రథోత్సవం
ఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన విమాన రథోత్సవ కార్యక్రమం బుధవారం తెల్లవారుఝాము వరకు సాగింది. పార్వతీ పరమేశ్వరుల కల్యాణం అనంతరం ఉత్సవ విగ్రహాలను విమాన రథోత్సవంలో ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు తాళ్ల సహాయంతో శివనామాన్ని స్మరిస్తూ రథాన్ని ముందుకు లాగారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా నైవేద్యం సమర్పించి రథోత్సవాన్ని ప్రారంభించారు. కేతకీ ఆలయ ప్రాంగణం నుంచి కక్కర్‌వాడ రోడ్డు పక్కనే ఉన్న బసవన్న మందిరం వరకు వెళ్లి తిరిగి యథాస్థానానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్‌పాటిల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, తదితరులు పాల్గొన్నారు.


