అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం

Feb 19 2026 11:01 AM | Updated on Feb 19 2026 11:01 AM

అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం

అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం

సంగారెడ్డి జోన్‌: గ్రామాల అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం అని కలెక్టర్‌ ప్రావీణ్య పేర్కొన్నారు. రెండురోజులపాటు జిల్లాలోని బడంపేట, సజ్జాపూర్‌, అనంతసాగర్‌, మల్లేపల్లి, గొంగళూరు, బస్వాపూర్‌, అరూర్‌, వెల్టూర్‌, అల్గోల్‌, మల్‌చల్మా గ్రామాలను సందర్శించిన ఆరు శాఖలకు చెందిన 60 మంది గ్రూప్‌–1 అధికారులు తమ శిక్షణను పూర్తి చేసుకుని బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల పనితీరు, పాఠశాలలు, పీహెచ్‌సీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ఉపాధిహామీ పనులను అధికారులు పరిశీలించారు. గ్రామ ప్రజలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో అధికారులు మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పాండు, నారాయణఖేడ్‌ సబ్‌కలెక్టర్‌ ఉమాహారతి, జెడ్పీ సీఈవో జానకిరెడ్డి పాల్గొన్నారు.

ఓటరు మ్యాపింగ్‌ పూర్తి చేయాలి

జిల్లాలోని అర్బన్‌ ప్రాంతాల్లో ఓటరు మ్యాపింగ్‌ తక్కువగా ఉన్నందున ఇంటింటికీ తిరిగి మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ నుంచి రెవెన్యూ శాఖ అధికారులతో ఎస్‌ఐఆర్‌ పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పోలింగ్‌ కేంద్రం వారీగా పురోగతిని పరిశీలించి, వెనుకబడి ఉన్న ఆయా ఏఈఆర్‌ఓలను కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 51.96% మాత్రమే మ్యాపింగ్‌ పూర్తయిందని, వేగవంతం చేసి పది రోజుల్లో 85% పూర్తి చేయాలని చెప్పారు. పనితీరు మార్చుకోని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కలెక్టర్‌ ప్రావీణ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement