సంస్కృతి విలక్షణం
గజ్వేల్ పురం..
2012లో మున్సిపాలిటీగా ఆవిర్భావం
● 9 గ్రామాల విలీనంతో పెరిగిన పరిధి ● 20 వార్డులు, 46వేలకుపైగా ఓటర్లు ● మూడోసారి ‘మున్సిపల్ పోరు’కు సిద్ధం
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. 2012లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన ఈ పట్టణం.. నేడు 11 గ్రామాల విలీనంతో పరిధి పెరిగింది. ఓటర్ల సంఖ్య 46వేల పైచిలుకు చేరుకుంది. ప్రస్తుతం మూడోసారి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. – గజ్వేల్
హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ భిన్నసంస్కృతులకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు నివాసముంటున్నారు. ప్రత్యేకించి కేరళ ఓనమ్ ఉత్సవాలు, మర్వాడీల ప్రత్యేక కార్యక్రమాలు ఏటా వైభవంగా జరుగుతాయి. ఇవేకాకుండా దేశంలోని భిన్న ఆచారాలు, సంప్రదాయాలు ఇక్కడ ఉండటం విశేషం. కేసీఆర్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి అందించిన విలక్షణ ప్రాంతమిది.
మొదట్లో టౌన్ మున్సిపాలిటీ
1959 నుంచి 1964వరకు ఈ పట్టణం టౌన్ మున్సిపాలిటీగా ఉండేది. ఆ తర్వాత పంచాయతీగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి 12మందికిపైగా సర్పంచ్‌లుగా కొనసాగారు. ఈ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చాలని గతంలో ఇక్కడి ప్రజలు డిమాండ్ చేయగా.. 2012 జనవరిలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌ను మున్సిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గజ్వేల్‌తోపాటు ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్‌పల్లి గ్రామాలను ఈ పట్టణంలోని విలీనం చేశారు. ఇటీవల మల్లన్నసాగర్ ముంపు గ్రామాలైన తొగుట మండలం పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డకిష్టాపూర్, బ్రహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్‌తోపాటు కొండపాక మండలం ఎర్రవల్లి పంచాయతీలు విలీనమైన సంగతి తెల్సిందే. దీనివల్ల ప్రస్తుతం 80వేలకు జనాభా 20 వార్డులు, 46,740మంది ఓటర్లతో పరిధి విస్తరించింది. ప్రస్తుతం మూడోసారి మున్సిపల్ ఎన్నికల తరుణంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వార్డుల సంఖ్య : 20
మొత్తం ఓటర్లు : 46,740
మహిళలు : 24,001
పురుషులు : 22,738
మున్సిపాలిటీగా ఆవిర్భావం తర్వాత
సంస్కృతి విలక్షణం


