కాంగ్రెస్‌లో టిక్కెట్ల తకరారు!
గందరగోళంలో కాంగ్రెస్ శ్రేణులు నామినేషన్లు ముగిసినా విడుదల కానిబీఆర్‌ఎస్ రెండో జాబితా 30 వార్డుల్లో బీజేపీ ఆశావహులనామినేషన్లు
విడుదల చేసిన మొదటి జాబితా చెల్లదని మంత్రి అజహరుద్దీన్ ప్రకటన
జహీరాబాద్: మున్సిపల్ ఎన్నికల టికెట్ల విషయమై కాంగ్రెస్ పార్టీలో గందర గోళం నెలకొంది. ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు గురువారం రాత్రి తన సంతకంతో కూడిన 19మంది కౌన్సిలర్ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించారు. అయితే.. ఈ జాబితాను మాత్రం కాంగ్రెస్ అధిష్టానవర్గం తోసి పుచ్చింది. జహీరాబాద్ పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి అజహరుద్దీన్ ఈ మేరకు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీలకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితా అనధికారమైనదని, ఆధారం లేనిదని పేర్కొన్నారు.
అయోమయంలో కాంగ్రెస్ శ్రేణులు
జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి గురువారం రాత్రి విడుదల చేసిన జాబితా అధికారికంగా వెలువడింది కాదని మంత్రి అజహరుద్దీన్ ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. జాబితాలో పేరు ఉన్న వారు సంతోషంలో మునిగి తేలారు. తీరా మంత్రి అజహరుద్దీన్ జాబితాను వెల్లడించలేదని ప్రకటించడంతో గందరగోళానికి గురవుతున్నారు. ఇంతకీ తమకు టికెట్ ఇచ్చినట్లా లేదా అనే అనుమానం వారిని వెంటాడుతోంది. వారి సంతోషం ఎంతో సేపు లేకుండా పోయింది. ఇప్పటికే విడుదలైన జాబితాలో ఏమైనా సవరణలు ఉంటాయా అనే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది. జాబితాలో సవరణలు ఉంటే తమ పేరు ఉంటుదా లేక ఊడుతుందా అనే భయం వారిని పట్టి పీడిస్తోంది. జాబితాలో పేరు ఉన్న వారిని స్థానిక పార్టీ ముఖ్య నేతలు ఎంత వరకు కాపాడుకోగలుగుతారనే ప్రశ్న పార్టీ కార్యకర్తల నుంచి ఉదయిస్తోంది.
బీఆర్‌ఎస్ జాబితాలోనూ జాప్యం
నామినేషన్ల ఘట్టం ముగిసినా ఇంకా బీఆర్‌ఎస్ సైతం రెండో జాబితాను విడుదల చేయలేదు. 37 వార్డులకు గాను 21 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను మాత్రమే ప్రకటించింది. కార్యకర్తల నుంచి ఎక్కువ ఒత్తిడి లేని స్థానాలను మాత్రమే ఖరారు చేసినట్లు, మితగా వార్డుల విష యమై ఆచి తూచి అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. పోటీ ఎక్కువ ఉన్న స్థానాల్లో అందరి సమ్మతి మేరకు అభ్యర్థిత్వాలను ఖరారు చేసే అవకాశం ఉంది.
3న తేలనున్న అభ్యర్థిత్వాలు
జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల అభ్యర్థిత్వాలు ఫిబ్రవరి 3వ తేదీన తేలనుంది. ఆ రోజు పార్టీ బీ ఫాం ఎవరికి ఇస్తే వారే అభ్యర్థులవుతారు. అప్పటి వరకు ఆశావహులకు కాళరాత్రి తప్పదనే చెప్పాలి.
30 వార్డులో బీజేపీ పోటీ
జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులకు గాను 30 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పలు వార్డుల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పార్టీ అధిష్టానవర్గం ఇప్పటి వరకు జాబితాను ప్రకటించలేదు. ఇది ఆశావహులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.


