రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
జిల్లా రవాణ అధికారి అరుణ
సంగారెడ్డి టౌన్: వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా రవాణా అధికారి అరుణ స్పష్టం చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి ఆర్టీసీ డిపోలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని రోడ్లపై జాగ్రత్తగా వాహనాలను నడిపించాలన్నారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఉపేందర్, ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ మున్సిపాలిటీని దక్కించుకోవాలి
బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి
జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ అత్యధిక కౌన్సిలర్ స్థానాలను గెలుపొంది చైర్మన్ పదవిని దక్కించుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కార్యకర్తలకు సూచించారు. జహీరాబాద్‌లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు బీజేపీ పట్ల ఆసక్తి చూపుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం కేంద్రం ఇచ్చే నిధుల కోసమే ఎన్నికలను నిర్వహిస్తోందని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి పైడి ఎల్లారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ జిల్లా నాయకులు జగన్నాథ్, శ్రీనివాస్‌గౌడ్, సుభాష్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోడల్ ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
వట్‌పల్లి(అందోల్): ఆదర్శ పాఠశాలలో 2026–27 సంవత్సరానికిగాను 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పోతులబొగుడా మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ డీనా బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రవేశాలు పొందేందుకు tgms.telangana.gov.inలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విద్యార్థి ఆధార్‌కార్డు, బోనఫైడ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసీ విద్యార్థులు రూ.200, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 ఆన్‌లైన్ ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్‌గా అజయ్‌కుమార్‌రెడ్డి
పటాన్‌చెరు టౌన్: ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్‌గా తెల్లాపూర్ డివిజన్ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అజయ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న మధుసూదన్‌రెడ్డిని తాండూర్ మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు. ఈ మేరకు సంబంధిత శాఖ బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది.
నీటిపారుదల శాఖ
సీఈగా రాజమ్మ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నీటిపారుదల శాఖ సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ (సీఈ)గా బి.రాజమ్మ నియమితులయ్యారు. మంచిర్యాల చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమెకు సంగారెడ్డి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జహీరాబాద్ కమిషనర్‌గా జైత్రాం నియామకం
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా డి.జైత్రాం నియమితులయ్యారు. కమిషనర్‌గా ఉన్న సత్యప్రణవ్ బదిలీ అయ్యారు. నెలరోజుల క్రితమే సత్యప్రణవ్ గ్రూపు పరీక్షల ద్వారా మున్సిపల్ కమిషనర్‌గా జహీరాబాద్‌కు వచ్చారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి


