ఇందిరమ్మ ఇళ్లకు తిరకాసు
‘ఉపాధి’కి ఇందిరమ్మ బిల్లుల
అనుసంధానం
లబ్ధిదారుల అనాసక్తి
జిల్లాకు 14,723 ఇళ్లు మంజూరు
ఇంకా ప్రారంభించనివి 6,723
వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు
మార్కింగ్ చేసినవి 8,000
పునాదిస్థాయిలో ఉన్నవి 6,401
రూఫ్, స్లాబ్ దశలో ఉన్నవి 7,163
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులను ఉపాధి హామీ పథకానికి అనుసంధానించారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. గతంలోలాగే నేరుగా బిల్లులు చెల్లించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
– సదాశివపేట రూరల్(సంగారెడ్డి)
ఇందిరమ్మ ఇళ్ల పథకం బిల్లుల చెల్లింపులో తిరకాసు పెట్టడంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించేందుకు అనాసక్తిగా ఉన్నారు. గతంలో దశలవారీగా రూ.5లక్షలను లబ్ధిదారులకు నేరుగా చెల్లించేవారు. ప్రస్తుతం వచ్చిన నూతన మార్గదర్శకాలతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం గోడల నిర్మాణం పూర్తి చేసిన వారికి రూ.1.40లక్షలు చెల్లిస్తున్నారు. మరో రూ.60వేలను ఉపాధి హామీ పనులకు అనుసంధానం చేశారు. దీంతో జిల్లాల్లో ఇందిరమ్మ గృహాల నిర్మాణ పనుల్లో వేగం మందగించింది.
బిల్లుల చెల్లింపులో మార్పు
లబ్ధిదారులకు ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పు జరిగింది. రూ.5లక్షలలో కొంతమేర ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేశారు. బిల్లుల చెల్లింపు విధానంలో వచ్చిన మార్పునకు లబ్ధిదారులు ఆందోళన చెందొద్దు. నిర్మాణం పూర్తయిన ప్రతీ ఇంటికి బిల్లులు అందుతాయి.
– మాధవరెడ్డి,హౌసింగ్ డీఈ సంగారెడ్డి


