నిర్దేశిత లక్ష్యం నెరవేరేనా?
రాయికోడ్(అందోల్): ఆర్థిక ఏడాది 2025–26కి గాను జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో రూ.38.17 కోట్ల ఫీజును వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే మార్కెట్లకు ప్రధానంగా మిల్లులు, సీసీఐ కేంద్రాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. జిల్లాలో రాయికోడ్, వట్‌పల్లి, జహీరాబాద్, సదాశివపేట, జోగిపేట, పటాన్‌చెరు, నారాయణఖేడ్, సంగారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. ఈ ఏడాది పత్తి దిగుబడి తగ్గిన నేపథ్యంలో మార్కెట్లకు వచ్చే ఆదాయంపై ప్రభావం పడనుంది. 2024–25 సంవత్సరంలో రూ.29.16 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించగా..లక్ష్యానికి మించి రూ.33.43 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి ప్రతికూల వాతావరణం, తగ్గిన పత్తి దిగుబడుల కారణంగా లక్ష్యం మేర ఆదాయం రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
సీసీఐ కేంద్రాల ద్వారా రూ.7.50 కోట్లు
2025–26 ఆర్థిక ఏడాదిలో జిల్లాలోని వివిధ మార్కెట్ల పరిధిలో సీసీఐ కేంద్రాల ద్వారా సుమారు రూ.7.50 కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ముందుగా నిర్ణయించిన లక్ష్యంలో సుమారు 90% ఆదాయం సమకూరనుంది. మార్చి చివరి వరకు పకడ్బందీగా ఫీజులు వసూలు చేసి లక్ష్యానికి చేరువగా ఆదాయం సమకూరేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.ఇప్పటివరకు సమకూరిన రూ.13.58 కోట్లు కాగా, సీసీఐ కేంద్రాలు, పత్తి మిల్లుల నుంచి వచ్చే ఆదాయం లెక్కించాల్సి ఉంది.
పత్తి దిగుబడి తగ్గడమే కారణం
మార్కెట్ల పరిధిలో ఫీజులు పకడ్బందీగా వసూలు చేస్తున్నాం. ఈసారి జిల్లాలో పత్తి దిగుబడి తగ్గడంతో మార్కెట్లకు వచ్చే ఆదాయంపై ప్రభావం చూపుతోంది. ప్రైవేటు మిల్లులు, సీసీఐ కేంద్రాల ద్వారా వచ్చే ఆదాయాలపై కచ్చితంగా అంచనా వేయలేం. మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యులు, సిబ్బంది సహకారంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి చేరువలో ఆదాయాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తాం.
–శ్రీకాంత్, డీఎంఓ సంగారెడ్డి


