విధులకు రాకున్నా హాజరా? | - | Sakshi
Sakshi News home page

విధులకు రాకున్నా హాజరా?

Jan 22 2026 9:52 AM | Updated on Jan 22 2026 9:52 AM

విధులకు రాకున్నా హాజరా?

విధులకు రాకున్నా హాజరా?

● రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ ఆగ్రహం ● జోగిపేట ఏరియా ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ

● రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ ఆగ్రహం ● జోగిపేట ఏరియా ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ

జోగిపేట(అందోల్‌): మీకు బుద్ధి ఉందా...విధులకు రాని డాక్టర్ల హాజరు కూడా వేసేస్తారా? మంత్రి నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా? పనులు చేయకుండా బయట తిరగడానికే మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తుందా? అని రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగిపేటలోని వైద్య విధాన పరిషత్‌ ఏరియా ఆస్పత్రిని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10 గంటలకు ఆస్పత్రికి చేరుకున్న కమిషనర్‌ ముందుగా డాక్టర్ల హాజరు రిజిష్టర్‌ను తీసుకుని పరిశీలించారు. అందులో 15 మంది డాక్టర్లు విధుల్లో ఉన్నట్లు అటెండెన్స్‌ రిజిష్టర్‌లో సంతకాలు చేసి ఉన్నాయి. విధుల్లో నలుగురు మాత్రమే ఉన్నారు. మిగతా వారు ఎక్కడున్నారని కమిషనర్‌ అడగ్గా...అక్కడి సిబ్బంది సదరు డాక్టర్లను తప్పించే ప్రయత్నం చేస్తూ ఆర్‌ఎంఓ అశోక్‌ టీకోసం వెళ్లారని, మిగతా డాక్టర్లు కూడా ఇక్కడిక్కడే ఉన్నారంటూ అబద్ధాలు చెప్పడంతో కమిషనర్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లోకి ఆలస్యంగా వచ్చిన ఆర్‌ఎంఓ అశోక్‌ను కమిషనర్‌ సిబ్బంది ముందే అసలు మీకు సిగ్గుందా? రోజుకొక పత్రికల్లో డాక్టర్ల నిర్లక్ష్యం, విధుల్లో గైర్హాజరీ వంటి కథనాలు వస్తుంటే మీరేం చేస్తున్నారు? కనీసం మంత్రి నియోజకవర్గమన్న భయం లేకుండా పనిచేస్తారా అంటూ నిలదీశారు. వచ్చిన 15 నిమిషాల్లో అన్ని వార్డులను తిరిగి రోగులతో మాట్లాడి సిబ్బందితో ఆస్పత్రి వివరాలను సేకరించారు. ఇన్‌చార్జి డాక్టర్‌ రాజేశ్వరి రోగుల వివరాలను కమిషనర్‌కు వివరించినా ఆయన సంతృప్తి చెందలేదు. ఆస్పత్రిలోని డాక్టర్ల పనితీరుపై మంత్రి దామోదర రాజనర్సింహ కూడా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.

గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు

డ్యూటీ రిజిస్టర్‌లో ఆబ్సెంట్‌ వేసి కమిషనర్‌ రీమార్క్‌లు రాశారు. డ్యూటీకి సరిగ్గా రాని వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే వేటు తప్పదని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా విధుల్లో లేకున్నా హాజరైనట్లు సంతకాలు చేసిన వారికి రెండు, మూడు రోజుల్లో షోకాజ్‌ నోటీసులు జారీ కానున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement