వలసొచ్చి.. వరినాట్లు | - | Sakshi
Sakshi News home page

వలసొచ్చి.. వరినాట్లు

Jan 17 2026 11:44 AM | Updated on Jan 17 2026 11:44 AM

వలసొచ్చి.. వరినాట్లు

వలసొచ్చి.. వరినాట్లు

జిల్లాలో యాసంగి వరి నాట్లు జోరందుకున్నాయి. కూలీల కొరత నేపథ్యంలో బిహార్‌, యూపీ, ఒడిశా తదితర రాష్టాల నుంచి వ్యవసాయ కూలీలు వచ్చి నాట్లు వేస్తున్నారు. ఈ యాసంగికి జిల్లాలో 1,22,180 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

– సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి):

జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, నారాయణ్‌ ఖేడ్‌, జహీరాబాద్‌ ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ బావులు, బోర్ల ఆధారంగా వరిని సాగు చేస్తున్నారు. కూలీల కొరత ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యవసాయ కూలీలు వరినాట్లు వేస్తున్నారు. కూలీలు బృందాలుగా ఏర్పడి స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకొని, ఒక్కో బృందంలో 15 నుంచి 20 మంది ఉన్నారు. నారు తీయడం నుంచి నాట్లు వేయడం వరకు మొత్తం పనిని మగ కూలీలే చేస్తున్నారు. నాట్లు వేసేందుకు రోజు వారీగా ఎకరానికి గుత్తకు మాట్లాడుకొని త్వరగా పూర్తి చేస్తున్నారు. రైతులు గుత్తకి ఇవ్వడంతో కూలీలు కూడా వెంటనే పనులు పూర్తి చేసి మరో చోటకు నాట్లు వేసేందుకు వెళ్తున్నారు. ఇలా ఒక్కో గ్రూప్‌ రోజుకు 6 నుంచి 8 ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు. ఎకరాకు రూ.4వేల నుంచి 5వేల వరకు రైతులు చెల్లిస్తున్నారు. డిమాండ్‌ ఉన్న చోట ఎక్కువ ఇస్తున్నారు. కొందరు స్థానికులే ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలతో ఒప్పందం చేసుకొని అడ్వాన్సులు చెల్లించి నాట్లు వేయడానికి తీసుకొస్తున్నారు. వారికి గ్రామాల్లోనే వసతి కల్పిస్తున్నారు. పొలాల్లో నాట్లు వేసేందుకు రైతులతోనూ ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు.

బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి కూలీల రాక

జోరుగా యాసంగి వరి నాట్లు

ఎకరాకు రూ. 4 వేల నుంచి 5వేలు

జిల్లాలో యాసంగి సాగు

1,22,180 ఎకరాలు

ఉపాధి పొందుతున్నాం

స్థానికంగా రైతుల పొలాల్లో నాట్లు వేసి ఉపాధి పొందుతున్నాం. ఒక్కో గ్రూప్‌ కలిసి రోజుకు ఆరు నుంచి ఎనిమిది ఎకరాల వరకు వరి నాట్లు వేస్తున్నాం. స్థానికంగా ఉంటూ పనులు చేస్తున్నాం.

–ఉత్తమ్‌, వ్యవసాయ కూలీ, బిహార్‌

నాట్లు పూర్తి కాగానే వెళ్తాం

మా రాష్ట్రంలో ఉపాధి దొరకక తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి నిమిత్తం వలస వచ్చాం. ఇక్కడి రైతులు మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఒక నెల వరకు ఉండి నాట్లు పూర్తి కాగానే తిరిగి మా రాష్ట్రానికి వెళ్తాం.

– అనురాగ్‌, వ్యవసాయ కూలీ, బిహార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement