త్రిముఖ పోరు..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రెండో విడత గ్రామపంచాయతీల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థితో పాటు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మద్దతు ఉన్న అభ్యర్థి బరిలో ఉన్నారు. చాలా చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థి కూడా పోటీలో ఉండటంతో పోరు రసవత్తరంగా సాగుతోంది. రెండో విడతలో మొత్తం పది మండలాల పరిధిలో 243 గ్రామపంచాయతీలకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో 14 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 229 గ్రామ పంచాయతీల సర్పంచుల స్థానాలకు మొత్తం 649 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ లెక్కన ఒక్కో సర్పంచ్ స్థానానికి ముగ్గురు బరిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు అభ్యర్థులు
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా గ్రామాల్లో ఇద్దరేసి అభ్యర్థులు బరిలో ఉన్నారు. పార్టీ మద్దతు పలికిన అభ్యర్థితో పాటు, ఇదే పార్టీ మద్దతు కోసం ప్రయత్నం చేసి భంగపడిన నాయకులు కూడా నామినేషన్ వేసి బరిలో నిలిచారు. ఇలాంటి తిరుగుబాటు అభ్యర్థులున్న గ్రామ పంచాయతీలు ప్రతి మండలంలో నాలుగు నుంచి ఆరు వరకు ఉంటాయి. ఈ తిరుగుబాటు అభ్యర్థులను బరిలోంచి తప్పించేందుకు ఆయా నియోజకవర్గాలకు చెందిన హస్తం పార్టీ ముఖ్యనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పార్టీ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి మాత్రం దాదాపు అన్ని ఒక్కరే అభ్యర్థి బరిలో నిలిచారు. దీంతో ఈ గులాబీ పార్టీకి రెబల్ బెడద దాదాపు లేకుండా పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో జిల్లాలో సత్తా చాటిన బీజేపీ అభ్యర్థులు చాలా గ్రామాల్లో బరిలో ఉన్నారు. పల్లె సంగ్రామం త్రిముఖ పోరుతో ఆసక్తి కరంగా మారింది.
సర్వత్రా ఉత్కంఠ
రెండో విడతలో 229 గ్రామాలకు ఆదివారం పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రి వరకు వార్డు సభ్యులు, సర్పంచ్ స్థానాల్లో ఎవరు విజయం సాధించారనేది అధికారులు ప్రకటించనున్నారు. ఈ ఫలితాల ప్రకటన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. కౌంటింగ్ చాలా ఆలస్యమైన గ్రామపంచాయతీల ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ సోమవారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దీంతో సర్పంచ్ అభ్యర్థులే కాకుండా, ఉప సర్పంచ్ పదవులు ఆశిస్తున్న నేతలు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది శనివారం మండల కేంద్రాల నుంచి తరలివెళ్లారు.
రెండో విడతలో సర్పంచ్ పదవులకు సగటున ముగ్గురు పోటీ
చాలా చోట్ల బరిలో కాంగ్రెస్ రెబల్స్
ఓటు బ్యాంకు చీలిపోతుందని
ఆ పార్టీలో ఆందోళన
నేడే 229 గ్రామపంచాయతీల్లో పోలింగ్
కేంద్రాలకు తరలివెళ్లిన
అధికారులు, సిబ్బంది


