మల్లన్న కల్యాణానికి రారండీ
● కొమురవెల్లిలో నేటి ఉదయం 10:45 గంటలకు.. ● ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొండా సురేఖ ● వేలాదిగా తరలిరానున్న భక్తజనం ● విస్తృత ఏర్పాట్లు చేసిన ఆలయ వర్గాలు
కొమురవెల్లి(సిద్దిపేట): భక్తుల కొంగుబంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. మల్లన్న క్షేత్రంలోని జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. ఈ మహోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు ఆలయవర్గాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. తోటబావి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ మండలపంలో మల్లికార్జున స్వామి, కేతలమ్మ, మేడలదేవిని ఉదయం 10.45నిమిషాలకు వివాహమాడనున్నారు. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించే కల్యాణోత్సవంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మల్లన్న కల్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు హాజరుకానున్నారు. శనివారం పీఠాధిపతులు మహమండలేశ్వర్, డాక్టర్ మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహంత్ మహస్వామి కొమురవెల్లికి చేరుకున్నారు.
స్వామి తరపున పడిగన్నగారి వంశస్తులు..
ఆలయ గర్భగుడిలో మల్లన్న మూల విరాట్ వద్ద మొదట కల్యాణ తంతును ప్రారంభించి అదే సమయంలో తోట బావి వద్ద ఉత్సవ విగ్రహాలకు కల్యాణం జరిపిస్తారు.


