రా.. పల్లె పిలుస్తోంది
జహీరాబాద్: పెద్ద పండుగలు వస్తున్నాయంటే రెక్కలు కట్టుకుని సొంతూళ్లకు వాలిపోతాం. సంక్రాంతి మరో నెలరోజులు ఉందనగానే పుట్టిన ఊరెళ్లేందుకు ముందే టికెట్లు బుక్ చేసుకుంటాం. ఏడాదిలో వచ్చే అనేక వేడుకలు, శుభ కార్యాలకు గ్రామానికి వస్తాం. అయిన వాళ్లతో హాయిగా గడిపి తిరిగి వెళ్లిపోతాం. మరి ఈనెల 14, 17వ తేదీలలో రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పల్లె మళ్లీ రమ్మంటోంది. అందరూ తప్పకుండా రావాలంటూ ఆహ్వానిస్తోంది. పల్లెకు వెళ్లి ఓటేసేందుకు అంతా సిద్ధం అవుతున్నారు. దీంతో సమగ్ర కుటుంబ సర్వేను గ్రామాలు మళ్లీ తలపింపజేయనుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వజ్రాయుధం లాంటిది. ఒక్క ఓటూ కీలకమే. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమైనదే. ఒక్క ఓటు తేడాతో ఓటమి చెందిన వారు ఎందరో ఉన్నారు. సమాన ఓట్లు కూడా వచ్చి టాస్ విధానంలో ఎన్నుకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయనే చెప్పవచ్చు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు నువ్వా.. నేనా అనే రీతిలో ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. దీంతో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక్కో ఓటు కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అనేక మంది విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రీత్యా పలు రాష్ట్రాలలో ఉంటున్నారు. ఉద్యోగులు బదిలీల కారణంగా పలు ప్రాంతాలలో నివసిస్తున్నారు. కూలీలు ఉపాధి నిమిత్తం పలు రాష్ట్రాలలో ఉన్నారు. ఓటు మాత్రం సొంతూరులో ఉంది. ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు సెలవు పెట్టుకుని వస్తే ఓటు వేయవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులను చూడవచ్చు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. దీంతో దూర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు ముందుగానే గ్రామానికి చేరుకోవాలి.
సొంతూరు బాట పట్టిన జనం
ఒక్క ఓటూ కీలకమే
ఉత్కంఠ రేపుతున్న పల్లెపోరు


