రెండో విడతకు రె‘ఢీ’
సంగారెడ్డి జోన్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. అందుకు సంబంధించి పూర్తి ఏర్పాటు చేశారు. జిల్లాలోని 10 మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సంబంధిత అధికారులు ఎన్నికల సామగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. జిల్లాలో 229 సర్పంచ్, 1941 వార్డు స్థానాలకు పోరు జరగనుంది. అయితే 14 సర్పంచ్, 222 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ సందర్భంగా 1200 మంది పోలీసు అధికారులతో మూడు అంచల భద్రత ఏర్పాటు చేశారు. 46 జోన్లు, 56 రూట్లుగా విభజించారు. పదిమంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 436 కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 2700 పీఓలు, 3259 మంది ఓపీఓలను నియమించారు. పది మండలాలలో మొత్తం 2,99,746 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 1,47,985 మంది పురుషులు,1, 51,757 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. కాగా, ఝరాసంగంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహ ణ సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
అప్రమత్తంగా ఉండండి
జహీరాబాద్ టౌన్: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో శనివారం పర్యటించారు. పట్టణంలోని బాగారెడ్డి స్టేడియం, మొగుడంపల్లిలోని డీఆర్సీ కేంద్రాలను ఆర్డీఓ దేవూజాతో కలిసి సందర్శించారు. ఎన్నికల విధులకు వెళుతున్న సిబ్బందితో పాటు రూట్ మొబైయిల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ సామగ్రితో డీఆర్‌సీ కేంద్రం నుంచి బయలుదేరిన సిబ్బంది తిరిగి వచ్చే వరకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ సైదానాయక్, సీఐ శివలింగం, జహీరాబాద్ టౌన్, రూరల్ ఎస్‌ఐలు వినయ్‌కుమార్, కాశీనాథ్ ఉన్నారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఉదయం 7 గంటల నుంచి పోలింగ్
మధ్యాహ్నం రెండు గంటల నుంచి
కౌంటింగ్, వెంటనే ఫలితాలు
తొందరపాటు నిర్ణయాలు వద్దు
పోలీసులకు ఎస్పీ సూచనలు


