అంతటా మనోళ్లే గెలవాలి
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తాచాటాలి
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
గజ్వేల్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాను చాటాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో రేషన్ కార్డుల కోసం, ఇళ్ల కోసం పేదలకు ఎదురుచూపులే మిగిలాయన్నారు. నేడు ఆ పరిస్థితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో విభేదాలను పక్కనబెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడమే కార్యకర్తలు, నాయకుల లక్ష్యం కావాలన్నారు.
ఏకగ్రీవ సర్పంచ్‌లకు సన్మానం
గజ్వేల్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికై న కాంగ్రెస్ సర్పంచ్‌లను మంత్రి వివేక్ సన్మానించారు. జగదేవ్‌పూర్ మండలం నిర్మల్‌నగర్ సర్పంచ్ కత్తి పద్మారావు, కొండాపూర్ సర్పంచ్ పుష్ప, పలుగుగడ్డ సర్పంచ్ కనకయ్య, వర్గల్ మండలం తున్కిమక్త సర్పంచ్ స్వామి, కుకునూర్‌పల్లి మండలం పీటీ వెంకటాపూర్ సర్పంచ్ భాస్కర్ తదితరులు సన్మానం పొందిన వారిలో ఉన్నారు.


