లెక్క.. చెప్పాలి పక్కా!
జనాభా ప్రాతిపదికన ప్రచార ఖర్చు
ప్రచార వ్యయంపై నిఘా
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు లెక్క చెప్పాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఖర్చుకు సంబంధించి ప్రతీ పైసాను తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ ఇటీవల జిల్లాలో జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు తమ ఖర్చుల రికార్డులతో వ్యయ పరిశీలకుల ముందు మూడు సార్లు విధిగా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటలలోపు ఖర్చులను పరిశీలిస్తారు. వ్యయాల పరిశీలనకు హాజరు కాని అభ్యర్థులకు నోటీసులు జారీ చేస్తామని, సరైన సంజాయిషీ ఇవ్వని వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్పంచ్, వార్డు సభ్యుడిగా బరిలో నిలిచే వారు ప్రత్యేక ఖాతా తెరిచి దాని ద్వారా చెల్లింపులు జరపాలి. ఖాతా నంబరు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది.
పరిమితిలోపే ఖర్చు
బరిలో నిలిచిన వారు తమకు నిర్ధారించిన పరిమితిలోపే ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. 5వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి రూ.2.50లక్షలు, వార్డు సభ్యులు రూ.50వేలకు మించి ఖర్చు చేయవద్దు. 5వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి ప్రచారం వ్యయం రూ.1.50లక్షలు, వార్డు సభ్యులు రూ.30వేలకు మించి ఖర్చు చేయొద్దు. ఎన్నికల సంఘం ఖరారు చేసిన వ్యయ పరిమితులకు లోబడి ఖర్చు చేయాలి. ఫలితాలు వచ్చిన 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించాలి. వ్యయ పరిమితి మించినా, లెక్కలు చూపించకపోయినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తారు. విజయం సాధించిన వారు ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలను అందించని పక్షంలో పదవుల నుంచి తొలగిస్తారు.
చికెన్ బిర్యానీ రూ.100,
మటన్ బిర్యానీ రూ.150
అభ్యర్థుల ప్రచార ఖర్చు ధరలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. అభ్యర్థులకు చికెన్ బిర్యానీకి రూ.100, మటన్ బిర్యానీకి రూ.150గా నిర్ధారించింది. చాయ్‌కు రూ.10, కాఫీ రూ.15, వాటర్ బాటిల్, కూల్‌డ్రింక్‌కు రూ.20, లస్సీకి రూ.35, వాటర్ ప్యాకెట్‌కు రూ.1, సాదా భోజనానికి రూ.80, సైకిల్ రిక్షా వినియోగిస్తే రోజుకు రూ.400, ఆటో రిక్షా రూ.1,500, లాటా ఏస్‌కు రూ.1,600, వెయ్యి పోస్టర్లకు రూ.5వేలు, నెత్తిన ధరించే టోపీకి రూ.40, టీషర్టుకు రూ.100గా చెల్లించాలని తెలిపింది. ఒకరోజు కారు అద్దె రూ.2,500, ఇన్నోవాకు రూ.3,500గా చూపాలి. కూర్చునేందుకు వినియోగించే కుర్చీ అద్దె రూ.20, వీఐపీ కుర్చీకి రూ.100, డప్పుకు రూ.700, బాణసంచాకు రూ.800గా లెక్కచూపుతూ బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది.
గెలిచినా, ఓడినా లెక్క తప్పని సరి
చాయ్‌కు రూ.10, చికెన్ బిర్యానీకి రూ.100
టోపీ, కరపత్రం, కుర్చీ, వాహనం అన్నింటికీ లెక్కలు
ఎన్నికల వ్యయ పరిశీలకులు పోటీ చేసే అభ్యర్థుల వ్యయంపై దృష్టి సారిస్తున్నారు. మండలానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బృందం సభ్యులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచార తీరును పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల వెంట తిరిగే జనం, వారి భోజనం, అల్పాహారం, ప్రచార కరపత్రాలు, వాహనాల ఖర్చు అంచనా వేసి సంబంధిత అధికారులకు సమర్పిస్తారు.
లెక్క.. చెప్పాలి పక్కా!


