పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ
● ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం
● కలెక్టర్ పి.ప్రావీణ్య
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): పంచాయతీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమైనదని, పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. సోమవారం మండలంలోని మద్దికుంట చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాలులో మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులకు రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు. పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని చెప్పారు. ఓటింగ్ విషయంలో గోప్యత నూటికి నూరు శాతం అమలు జరిగేలా చూడాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సాఫీగా, పారదర్శకంగా జరగాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ తరగతుల నోడల్ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, తహసీల్దార్ బాల్రాజ్, ఎంపీడీవో లక్ష్మి పాల్గొన్నారు.


