పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Dec 9 2025 10:49 AM | Updated on Dec 9 2025 10:49 AM

పిల్లల పట్ల ప్రత్యేక  శ్రద్ధ వహించాలి

పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ ఎన్నికల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికల ప్రాంతాల్లో రెండు రోజులు సెలవులు పాత 50 పైసల నాణేలు చెల్లుతాయి

న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య

సంగారెడ్డి టౌన్‌: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని శిశుగృహం, సఖీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. క్రమశిక్షణతో ఉంటూ చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల బాగోగులను చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరమైతే ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు.

సంగారెడ్డి టౌన్‌: సంగారెడ్డిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మహిళలకు మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ రాజేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 19 నుంచి 40 ఏళ్లలోపు సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల మహిళలు అర్హులని పేర్కొన్నారు. రేషన్‌, ఆధార్‌ కార్డులు, నాలుగు పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫోటోలతో ఈ నెల 17వ తేదీ వరకు సంగారెడ్డి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

సంగారెడ్డి జోన్‌: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆయా మండలాలలో మూడు దశలలో అధికారులు ఓటు వేసేందుకు వీలు కల్పించారు. మండల కేంద్రాలలో ఓటు వేసేందుకు వచ్చే అధికారుల సౌకర్యార్థం ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలలో ప్రత్యేకంగా అధికారులను నియమించి, ఓటింగ్‌ ప్రక్రియ జరిగే విధంగా చూస్తారు. మొదటి దశ ఎన్నికలలో పాల్గొనే అధికారులకు మంగళవారం ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. రెండో విడతలో హాజరయ్యే అధికారులకు ఈనెల 10 నుంచి 12 వరకు, చివరి దశ ఎన్నికల అధికారులకు 13 నుంచి 15 వరకు సమయం ఉంటుంది. మూడు దశలలో జరిగే ఎన్నికలకు 13,900పైగా అధికారులు ఎన్నికల విధులకు హాజరుకానున్నారు. వీరందరూ శిక్షణ కార్యక్రమాలు జరిగే ప్రదేశాలలో బ్యాలెట్‌ ఓటింగ్‌ కొరకు ఫాం14 దరఖాస్తులు పూర్తి చేశారు. ఒక వేళ అక్కడ ఫాం 14 తీసుకుని వారు నేరుగా మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో అక్కడే తీసకుని ఓటు వేయవచ్చు.

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో స్థానిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 11న మొదటి విడతగా గుమ్మడిదల, హత్నూర, కంది, సంగారెడ్డి, సదాశివపేట్‌, కొండాపూర్‌, పటాన్‌చెరు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు 10, 11న సెలవులు ప్రకటించారు. అలాగే.. రెండో విడత ఎన్నికలు జరగనున్న అందోల్‌, చౌటకూర్‌, ఝరాసంగం, కోహీర్‌, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్‌కల్‌, రాయికోడ్‌, వట్‌పల్లి, జహీరాబాద్‌ ప్రాంతాల్లోని పాఠశాలలకు 13, 14న సెలవులు, మూడో విడతగా ఎన్నికలు జరగనున్న కల్హెర్‌, కంగ్టి, మనూర్‌, నాగిల్‌గిద్ద, నారాయణఖేడ్‌, నిజాంపేట్‌, సిర్గాపూర్‌, న్యాల్‌కల్‌ ప్రాంతాల్లోని పాఠశాలలకు 16, 17న సెలవులు ప్రకటించారు.

వాటప్స్‌ ద్వారా ఆర్‌బీఐ మెసేజ్‌లు

జహీరాబాద్‌ టౌన్‌: పాత 50 పైసల కాయిన్‌తో పాటు అన్ని నాణేలు చట్టబద్దమైన కరెన్నీగానే ఉన్నాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ప్రతి ఒక్కరికి వాట్సప్‌లో మెసేజ్‌ల ద్వారా ప్రకటించింది. 50 పైసల నాణేలు చెల్లవని సోషల్‌ మీడియాలో ఫేక్‌ మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ మేరకు ఆర్‌బీఐ ప్రజలకు నమ్మకం కల్గడానికి వాట్సప్‌ మెసేజ్‌లు పంపుతుంది. తప్పుడు ప్రచారం ఆపేందుకు ఆర్బీఐ వీడియోతో పాటు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 50 పైసల నుంచి రూ.1, రూ.2, రూ.5, రూ.10 వరకు నాణేలు ఏ డిజైన్‌లో ఉన్నా.. ఏ సీరీస్‌లో ఉన్నా.. అన్నీ చెల్లుతాయని, అన్నీ కూడా చట్టబద్ద గల నాణేలు అన్ని స్పష్టం చేసింది. నాణేలపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, వ్యాపారులు తిరస్కరిస్తే అది చట్టవిరుద్ధమని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement