చెరకు రైతు క్రష్‌..! | - | Sakshi
Sakshi News home page

చెరకు రైతు క్రష్‌..!

Dec 9 2025 10:49 AM | Updated on Dec 9 2025 10:49 AM

చెరకు రైతు క్రష్‌..!

చెరకు రైతు క్రష్‌..!

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: చెరకు రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ధాన్యం, మొక్కజొన్న మాదిరిగానే చెరకు కొనుగోలుకు కూడా తరుగు తీస్తున్నారు. ఈ తరుగు పేరుతో ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఏకంగా ఐదు శాతం తూకంలో కోత పెడుతుండటంతో రైతులు లబోదిమంటున్నారు. చెరకు అసలే అంతంత మాత్రంగానే ధర చెల్లిస్తున్న యాజమాన్యాలు.. ఇప్పుడు తరుగు పేరుతో నిండా ముంచుతుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టన్నుకు రూ.190 వరకు నష్టం

నిబంధనల ప్రకారం చెరకుకు ఎలాంటి తరుగు తీయరాదు. ట్రాష్‌ (చెత్త) మెటీరియల్‌ ఉంటేనే కేవలం ఒక్కశాతం మాత్రమే తరుగు తీయాలి. అదికూడా రైతుల చెరకును బెండింగ్‌ మీటర్‌లో వేసి ట్రాష్‌ మెటీరియల్‌ ఉందని తేలితేనే ఒక్క శాతమే తరుగు తీయాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా తరుగు తీస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హార్వేస్టర్‌ మిషన్‌తో కోసిన చెరుకులో ట్రాష్‌ మెటీరియల్‌ ఉందంటూ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఐదు శాతం తూకంలో కోత పెడుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఐదు శాతం అంటే ఒక టన్నుకు అర క్వింటాళు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం టన్ను చెరుకు ధర రూ.3,800 పలుకుతోంది. అర క్వింటాలు తరుగు పోతే రైతుకు కేవలం రూ.3,610 మాత్రమే ధర దక్కుతోంది. ఇలా చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా తరుగు తీస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. స్థానిక రైతులు (ఫ్యాక్టరీ జోన్‌)లో ఉన్న రైతుల చెరకుకు ఐదు శాతం తరుగు విధిస్తున్న యాజమాన్యాలు.. స్థానికేతర (ఇతర ఫ్యాక్టరీల జోన్‌లో ఉన్న) రైతులకు రెండు నుంచి మూడు శాతం తరుగు తీస్తుండటం గమనార్హం.

ఇప్పటికే రైతులకు నష్టం

రూ.1.20 కోట్లకు పైనే..

జిల్లాలో ఈసారి 11,434 హెక్టార్లలో చెరకు సాగైంది. సుమారు 7.92 లక్షల టన్నుల చెరకు పండుతుందని కేన్‌ కమిషనరేట్‌ అధికారులు అంచనా వేశారు. ఈ సీజనులో జిల్లాలో రెండు చక్కెర కర్మాగారాలు క్రషింగ్‌ను ప్రారంభించాయి. గత నెల 14 నుంచి క్రషింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటి వరకు సుమారు 1.05 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్‌ జరిగింది. ఈ లెక్కన 1.05 లక్షల టన్నుల్లో సగటున మూడు శాతం చొప్పున తరుగు లెక్కేసినా రైతులు సుమారు 3,173 టన్నులు నష్టపోయారు. దీని విలువ సుమారు రూ. రూ.1.20 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లెక్కన క్రషింగ్‌ సీజన్‌ ముగిసే వరకు రైతులు ఎంత నష్టపోతారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

భగ్గుమన్న రైతు సంఘాలు

చక్కెర కర్మాగారాలు నిబంధనలకు విరుద్దంగా తరుగు తీయడం పట్ల రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ తరుగు దోపిడీకి అడ్డుకట్టవేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. చెరకు క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో.. ఇటీవల కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, రైతుల సంఘాలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తరుగు దోపిడీ అంశాన్ని రైతు సంఘాల నేతలు లేవనెత్తారు.

తరుగు పేరిట ఐదు శాతం తూకంలో కోత

లబోదిబోమంటున్న చెరకు రైతులు

అసలే అంతంత మాత్రంగా ధర చెల్లిస్తున్న యాజమాన్యాలు

ఆపై కోతలతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement