జీఎస్టీ ఎగవేత | - | Sakshi
Sakshi News home page

జీఎస్టీ ఎగవేత

Dec 5 2025 1:18 PM | Updated on Dec 5 2025 1:18 PM

జీఎస్టీ ఎగవేత

జీఎస్టీ ఎగవేత

జోరుగా జీరో దందా..

సర్కార్‌ ఖజానాకు భారీగా గండి

విజిలెన్స్‌ తనిఖీలతో వెలుగులోకి అక్రమాలు

రాష్ట్ర విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఇటీవల ముంబై హైవేపై వాహనాల తనిఖీలు నిర్వహించింది. జీఎస్టీ (వస్తు సేవల పన్ను) చెల్లించకుండా వివిధ రకాల సరుకులను అక్రమంగా రవాణా చేస్తున్న నాలుగు భారీ వాహనాలను పట్టుకుంది. వాణిజ్యపన్నుల శాఖకు వీటిని అప్పగించగా, వాటిని రూ.లక్షకు పైగా జరిమానాలు విధించారు. ఒక్క రోజు నిర్వహించిన తనిఖీల్లోనే నాలుగు వాహనాలు పట్టుబడ్డాయంటే.. నిత్యం ఎన్ని వాహనాలు ఇలా పన్నులు చెల్లించకుండా రవాణా అవుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

తాజాగా బుధవారం చేసిన తనిఖీల్లో కూడా తొమ్మిది వాహనాలు జీఎస్టీ ఎగవేస్తున్న అక్రమ రవాణా చేస్తున్నవే ఉన్నాయి. వీటిని కూడా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించగా, రూ.2.30 లక్షల జరిమానా విధించినట్లు ఆశాఖ రాష్ట్ర విజిలెన్స్‌ డైరెక్టర్‌ ప్రకటించారు.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో జీరో దందా జోరుగా జరుగుతోంది. సర్కార్‌ ఖజానాకు జమ చేయాల్సిన జీఎస్టీని యథేచ్ఛగా ఎగవేస్తున్నారు. దీంతో సర్కార్‌ ఖజానాకు భారీగా గండి పడుతోంది. రాష్ట్ర విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నిర్వహిస్తున్న తనిఖీలో తరచూ జీఎస్టీ ఎగవేత వాహనాలు ఉండటం గమనార్హం. ఆకస్మికంగా ఒక్కసారి తనిఖీ చేస్తేనే పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడ్డాయంటే.. నిత్యం ఎన్ని వాహనాలు ఇలా జీఎస్టీని ఎగవేస్తూ సరుకులు రవాణా అవుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

అధిక పన్ను రేటు జాబితాలో ఉన్న సరుకులు

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీఎస్టీ పన్ను విధానంలో సంస్కరణలు తెచ్చిన విషయం తెలిసిందే. విలాస వస్తువులతో పాటు, ఆరోగ్యానికి హాని చేసే గుట్కా, పాన్‌మసాల, పొగాకు జర్థా వంటి వస్తువులను 40 శాతం పన్ను రేటు పరిధిలోకి వచ్చాయి. అక్రమార్కులు ఇలాంటి అధిక పన్నుల కేటగిరీల్లో ఉన్న సరుకులను యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తు సర్కార్‌ ఖజానాకు గండికొడుతున్నారు. పాన్‌మసాలపై ప్రస్తుతం 40 శాతం జీఎస్టీ ఉంది. అంటే ఒక్క వాహనంలో కనీసం రూ.25 లక్షల విలువ చేసే పాన్‌మసాల సరుకులు రవాణా చేస్తే.. ఇందుకు జీఎస్టీ రూ.16 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో వాహనం పన్ను చెల్లించకుండా అక్రమ రవాణా చేస్తుండటంతో సర్కార్‌ ఖజానాకు రూ.కోట్లలో గండిపడుతోంది.

కర్నాటక – మహారాష్ట్ర

సరిహద్దుల్లో..

జిల్లాకు కర్నాటకతో పాటు, మహారాష్ట్ర రెండు అంతర్రాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి నిత్యం సరుకులు రవాణా అవుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి రవాణా అయ్యే వాహనాలు ముంబై హైవే రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ హైవే ఇప్పుడు అక్రమ రవాణాకు రహదారిగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement