అల్లం రైతులకు ఊరట
జహీరాబాద్: ఎట్టకేలకు అల్లం ధర స్వల్పంగా పైకి ఎగబాకుతోంది. రెండేళ్ల నుంచి ధర పాతాళంలో ఉండడంతో రైతులు నష్టాలను చవిచూశారు. ప్రస్తుతం ధర పెరుగుతుండడం రైతులకు ఊరటనిస్తోంది. దీంతో పంటను సాగు చేసుకున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే జహీరాబాద్ నియోజకవర్గంలో అల్లం పంట అధికంగా సాగవుతోంది. ప్రతి ఏటా సుమారు 3వేల ఎకరాలకు పైగా పంట సాగవుతూ వస్తోంది. గత ఏడాది ధర పూర్తిగా పడిపోవడంతో పంట సాగు విస్తీర్ణం సగానికి సగం పడిపోయింది. జిల్లాలో ప్రస్తుతం సుమారు 1,200 ఎకరాల్లో పంట సాగులో ఉన్నట్లు తెలుస్తోంది. గత జూన్‌లో క్వింటాలు ధర రూ.2వేల నుంచి రూ.2,500 మాత్రమే పలికింది. ప్రస్తుతం ధర రెట్టింపు పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో క్వింటాలు ధర రూ.4వేల నుంచి రూ.4,500 వరకు పలుకుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది అధికంగా వర్షాలు పడడం వల్ల పంటలు సైతం దెబ్బతిన్నాయి. అల్లం పంటను సాగు చేసుకున్న రైతులు ఎకరం పంటపై రూ.2లక్షల వరకు నష్టాలను చవిచూశారు. 10 ఎకరాలు పంటను సాగు చేసుకున్న రైతులు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు నష్టాలను చవి చూశారు. అల్లం ధర పెరుగుతుండడం రైతులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
లాభం రాకున్నా..
పక్క రాష్ట్రాల్లో విస్తారంగా సాగు
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జహీరాబాద్ ప్రాంతం, కేరళ రాష్ట్రంలో మాత్రమే అల్లం పంట సాగయ్యేది. ప్రస్తుతం సాగు దేశ వ్యాప్తంగా విస్తరించింది. ప్రధానంగా కేరళ, పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో అల్లం పంట సాగు విస్తరించింది. ఇందులో అత్యధికంగా కేరళ రాష్ట్రంలో సుమారు 5లక్షల ఎకరాల్లో పంట సాగవుతోందని అల్లం రైతులు పేర్కొంటున్నారు. అధిక సాగు ధరపై ప్రభావం చూపుతోంది.
కేరళలో దెబ్బతిన్నందునే...
దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో అల్లం పంటను పండించే కేరళ రాష్ట్రంలో పంట దెబ్బతినడం వల్లే మార్కెట్లో ధర పెరిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. అక్కడ వర్షాలు అధికంగా పడడంతో పంట దెబ్బతినడంతో హైదరాబాద్ మార్కెట్‌కు అంతంత మాత్రమే వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
ధర పెరగడంతో చిగురించిన ఆశలు
క్వింటాలు ధర రూ.4వేలు
కేరళలో పంట దెబ్బతినడంతోనే..


