సరదా కాకూడదు పెద్ద శిక్ష
● లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సౌజన్య
● ర్యాగింగ్, పోక్సో చట్టాలపై విద్యార్థులకు అవగాహన
మాట్లాడుతున్న సౌజన్య
సంగారెడ్డి: చిన్నపాటి సరదా పెద్ద శిక్ష కాకూడదని లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య విద్యార్థులకు ఉద్బోధించారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో గురువారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాగింగ్, పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ..ర్యాగింగ్ చట్టపరంగా తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. చిన్నపాటి సరదాతో జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దని సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలకు గురవుతాయని హెచ్చరించారు. ర్యాగింగ్‌ను చూసి మౌనం పాటించడం కూడా నేరమేనని, ఆ సమయంలో బాధితులకు మద్దతు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్లు జూనియర్లకు ఆదర్శంగా ఉండాలన్నారు. మైనర్లతో అనుచిత ప్రవర్తన, గోప్యత ఉల్లంఘన, ఆన్‌న్‌లైన్ వేధింపులు కూడా ఈ చట్టం కింద నేరాలేనని విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకం ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్‌ను నాశనం చేస్తుందని విద్యార్థులకు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రఘునందన్, డీఆర్‌ఓ పద్మజారాణి, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ జయప్రకాష్, ర్యాగింగ్ కమిటీ సభ్యులు కూన వేణుగోపాల్, మఠం శంకర్ తదితరులు పాల్గొన్నారు.


