చండీయాగం, దత్త హోమం
భక్తిశ్రద్ధలతో దత్త జయంతి వేడుకలు
ఝరాసంగం(జహీరాబాద్): మండలంలోని శ్రీ బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శ్రీ దత్తాత్రేయ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురువారం పౌర్ణమి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్దేశ్వర స్వామిల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. మూడు రోజులుగా 21 యజ్ఞ గుండాలతో నిర్వహించిన శ్రీ చండీయాగం, దత్త హోమం పూజా కార్యక్రమాలు ముగిశాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఆశ్రమ ఆవరణ అంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఉదయం నుంచి సా యంత్రం వరకు హోమం, స్వామి వారికి డోలారోహణం కార్యక్రమాలతో పాటు పూర్ణాహుతి, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆశ్రమ ఆవరణలోని జ్యోతిర్లింగాల వద్ద పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ అనసూయ మాత, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ప్రముఖ హాస్య నటుడు పృథ్విరాజ్, భక్తులు పాల్గొన్నారు.
21,600లో దీపారాధన
శ్రీ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని ధ్యాన మందిర ఆవరణలో 21,600 దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.


