భారతదేశం సంప్రదాయాలకు నిలయం
కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతి
కొండపాక(గజ్వేల్): దేవాలయాలు భావితరాలను హిందూ, సనాతన వైదిక ధర్మాలవైపు నడిపిస్తాయని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మర్పడ్గలో గల విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆయన విజయదుర్గ మాతకు స్వర్ణ కిరీట ధారణ చేశారు. ఈ సందర్భంగా భక్తుల నుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమన్నారు. కూలీ నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల సహకారంతో విజయదుర్గ మాతకు 1600 గ్రాముల స్వర్ణ కిరీటధారణలో భాగస్వాములవ్వడం గొప్ప విషయమన్నారు. ఏదేని పనిని సత్సంకల్పంతో మొదలు పెడితే తప్పకుండా విజయం వైపు నడిపిస్తాయన్నారు. కార్తీక మాసంలో శివాలయాల్లో చేసే పూజలు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తాయన్నారు. అంతకు ముందు క్షేత్రం నిర్వాహకులు హరినాథ శర్మ ఆధ్వర్యంలో రాంపూర్ దేవాలయ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, కలెక్టర్ హైమావతి పూర్ణకుంభంతో జగద్గురు శంకరాచార్య విజయేంద్ర స్వామికి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి, దేవాలయ కమిటీ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
జగద్గురు శంకరాచార్య విజయేంద్ర స్వామికి స్వాగతం పలుకుతున్న కలెక్టర్ హైమావతి
విజయ దుర్గామాతకు
స్వర్ణ కిరీటధారణ చేసిన దృశ్యం
భారతదేశం సంప్రదాయాలకు నిలయం


