తుపాకీతో ఆర్‌ఎంపీకి బెదిరింపులు
మాజీ మిలిటెంట్ల పనేనా!
మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో ఇద్దరు అగంతకులు ఓ ఇంట్లోకి చొరబడి తుపాకితో బెదిరించిన ఘటన కలకలం సృష్టిస్తోంది. డబ్బుల కోసం తుపాకితో బెదిరించింది అగంతకులా లేక మాజీ మిలిటెంట్లేనా అంటూ మండల పరిధిలో జోరుగా చర్చ జరుగుతోంది. వివరాలు ఇలా... మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ లక్ష్మీనర్సయ్య ఇంట్లోకి మంకీ క్యాపులు ధరించిన ఇద్దరు అగంతకులు వచ్చారు. తమది సిరిసిల్ల జిల్లా అనీ, ఇంట్లో ఉన్న నగలు డబ్బులు ఇవ్వాలంటూ తుపాకి చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు తేరుకుని కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు వచ్చి పట్టుకునేలోపు బైక్‌పై పారిపోయారు. స్థానికులు పట్టుకునే పెనుగులాటలో ఓ అగంతకుడి మంకీ క్యాపు ఊడిపోయింది. దీంతో ఆ వ్యక్తి ధర్మారం గ్రామానికి చెందిన వాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంపై మిరుదొడ్డి ఎస్‌ఐ సమతను వివరణ కోరగా... రుద్రారంలో ఇద్దరు అగంతకులు తుపాకితో బెదిరింపులకు పాల్పడింది వాస్తవమేనన్నారు. నిందితులను పట్టుకుని త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా దుండగులను పట్టుకుని శిక్షించాలని బాధితుడు ఆర్‌ఎంపీ లక్ష్మీనర్సయ్య అధికారులను కోరారు. రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను కోరాడు. బాధితుడిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం పరామర్శించారు. అగంతకులను పట్టుకోవాలని పోలీసులకు సూచించారు.నాయకులు జెన్నారెడ్డి, కనకయ్య, రాజేశ్వర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, సంజీవ్, లక్ష్మినర్సు, కిష్ట య్య, రాజు, ఆంజనేయులు, ప్రశాంత్ ఉన్నారు.


