అభివృద్ధి పనులు వేగవంతం
కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పారిశ్రామిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సంగారెడ్డి, జహీరాబాద్ డివిజన్లలో కొనసాగుతున్న నిమ్జ్, జాతీయ రహదారి–65 విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ, నిమ్జ్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నిమ్జ్, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులకు జాప్యం లేకుండా పరిహారం అందించాలన్నారు. భూములిచ్చిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు నిధల కొరత లేదని స్పష్టం చేశారు. జాతీయ రహదారి 65 విస్తరణలో భాగంగా చేపట్టిన సర్వీస్ రోడ్డు పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆయిల్‌పామ్ సాగుకు భూములు గుర్తించాలి
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు అనువైన భూములను గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఒకసారి ఆయిల్ ఫామ్ పంట దిగుబడి రావడం ప్రారంభమైతే 25–30 ఏళ్లపాటు వరుసగా ఆదాయం వస్తుందన్నారు. జిల్లాలో ఈ ఏడాది 3,750 ఎకరాలు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 1,400 ఎకరాలలో సాగు చేసినట్లు తెలిపారు. ప్రతీరోజు రైతులు సహకార సంఘానికి వస్తుంటారని అలాంటి రైతులకు సీఈవోలు ఆయిల్‌పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, ప్రోత్సాహక పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు తగిన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పీఏసీఎస్ కార్యదర్శులు రైతులను చైతన్యపరచడంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. సమావేశంలో నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, సంగారెడ్డి–జహీరాబాద్ ఆర్డీఓలు, టీజీఐఐసీ, నిమ్జ్, జాతీయ రహదారి అథారిటీ అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి పీహెచ్ పండరీ, డీసీఓ కిరణ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


