
డెత్ స్పాట్..
పది నెలల్లో 15 మంది బలవన్మరణం సీసీ కెమెరాలు, పర్యవేక్షణ కరువు భద్రత చర్యలు చేపట్టని అధికారులు
ఆత్మహత్యలకు కేరాఫ్ చెరువు
సంగారెడ్డి క్రైౖమ్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో చూడగల ప్రదేశాల్లో మహబూబ్ సాగర్ (మినీ ట్యాంక్ బండ్) ఒకటి. అది ఒక అప్పటి మాట. ఇప్పుడు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా, డెత్ స్పాట్‌గా మారింది. ఇటీవల ఈ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి.
చెరువు చుట్టూ సరైన రక్షణ కవచం లేక ఆత్మహత్య చేసుకునే వారు కట్టపై నుంచి చెరువులోకి దూకుతున్నారు. సందర్శకుల భద్రతతో పాటు ఆత్మహత్యలను కట్టడి చేసేందుకు ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణ అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ఆత్మహత్యలకు స్పాట్‌గా మారింది. తాజాగా ఈనెల 11న గుర్తుతెలియని యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఏడాది మార్చి17న మెదక్ జిల్లాకు చెందిన తల్లి, కూతుర్లు ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత మృతదేహాలు నీటిలో తేలాయి. గడిచిన 10 నెలల్లో గుర్తుతెలియని మృతదేహలు దాదాపు 10 నుంచి 15మంది చెరువులో తేలడంతో పోలీసులు వాటిని బయటకు తీసి కేసులు నమోదు చేశారు.
భద్రత కరువు..
గత ప్రభుత్వాలు ఈ చెరువుని (మినీ ట్యాంక్ బండ్) అభివృద్ధి పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేశారు. చెరువు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. రాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్ వాహనాలు ఇటు వైపు రాకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా యని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో ఏఎస్‌ఐ స్థాయి అధికారితో పాటు మూడు నుంచి ఐదు మంది సిబ్బంది నిత్యం విధుల్లో ఉండేవారు. ప్రస్తుతం ఒక్క కానిస్టేబుల్ కూడా విధుల్లో లేకపోవడం గమనార్హం.
కనిపించని హెచ్చరిక బోర్డులు
చెరువును చూడటానికి నిత్యం పట్టణ ప్రజలతో పాటు, చుట్టు ప్రక్కల గ్రామల నుంచి దాదాపు 50 నుంచి 150 మంది సందర్శకులు వస్తుంటారు. చెరువు కట్టపై పలు చోట్ల కనిపించని హెచ్చరిక బోర్డులు, ప్రమాదకర స్థాయి నీటి మట్టం లోతు , రెండు వైపులా కంచెలు లేవు. దీంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మద్యం తాగిన అనంత రం చెరువులో ప్రమాదకరంగా చేపలు పట్టబో యి, ఈత రాక తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
రక్షణ చర్యలు చేపడతాం
చెరువు కట్టపై భద్రత చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు గురించి మున్సిపాలిటీ, పలు శాఖల అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తాం. రాత్రి సమయంలో భద్రత సిబ్బందితో పాటు, పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఉండేలా చూస్తాం. పాదచారులు, సందర్శకులు ఎప్పుడు పడితే అప్పుడు రాకుండా సమయ పాలన బోర్డు ఏర్పాటు చేస్తాం.
– రమేశ్, పట్టణ సీఐ

డెత్ స్పాట్..