
మెడికల్ మాయ!
యథేచ్ఛగా శాంపిల్స్ మందుల అమ్మకాలు
● నిరక్ష్యరాస్యులకు అంటగడుతున్న వైనం
● ఫార్మసిస్టుల పేరుతో దుకాణాలకు అనుమతులు
● పట్టించుకోని అధికారులు
మెడికల్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో పలు కంపెనీ శాంపిల్స్ మందుల విక్రయంతో పాటు జనరిక్‌ను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
–తూప్రాన్
నిబంధనల ప్రకారం మందుల దుకాణం పెట్టుకునేందుకు ఫార్మసీ కోర్సులు చదివిన వారు అర్హులు. అయితే జిల్లాలోని మెడికల్ షాపుల్లో చాలా వరకు ఈ కోర్సు పూర్తి చేసిన వారు కనిపించరు. ఎవరో ఒకరి వద్ద ఫార్మసీ సర్టిఫికెట్ అద్దెకు తీసుకుని దుకాణాలు నడుపుతున్నారు. జిల్లాలో 560 మెడికల్ షాపులు, 47 ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా మందులు విక్రయించేవారు వందల్లో ఉంటారు. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శాంపిల్స్‌ను విక్రయిస్తూ..
వివిధ మందుల కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకునేందుకు వైద్యులకు శాంపిల్స్‌ను అందిస్తాయి. వీటిని విక్రయించకూడదు. వాటిపై ‘నాట్ ఫర్ సేల్’ అని ముద్రించి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్‌ఎంపీ వైద్యుల వద్ద శాంపిళ్ల మందులు అధికంగా ఉంటున్నాయి. వీరు రోగులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ శాంపిల్స్ మందుల దుకాణాల్లో కూడా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మందులను నిరక్ష్యరాస్యులకు విక్రయిస్తున్నారు. ఈ తతంగం అంతా ఆస్పత్రుల పరిధిలో ఉన్న మెడికల్ షాపుల్లో ఎక్కువగా సాగుతున్నట్లు సమాచారం.
పెరుగుతున్న ఏజెన్సీలు
మెదక్ జిల్లా హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతో ఇటీవల మెడికల్ ఏజెన్సీలు పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్నాయి. జిల్లాలో 47 ఏజెన్సీలు, 560 మెడికల్ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి జిల్లాల్లోని ఆయా ప్రాంతాలకే కాకుండా కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. వీటిని సైతం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
మెడికల్ షాపుల్లో శాంపిల్స్ అమ్ముతున్నట్లు తమకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ చంద్రకళ పేర్కొన్నారు. లైసెన్స్‌లు తప్పకుండా నిర్వాహకుల పేరు మీదనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల జిల్లాలో ఐదుగురు ఆర్‌ఎంపీలపై కేసులు నమోదు చేశాం. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
–చంద్రకళ, జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్, మెదక్
కాసులు కురిపిస్తున్న..
వివిధ కంపెనీలు తయారు చేస్తున్న జనరిక్ మందులు మెడికల్ షాపుల యజమానులకు కాసులు కురిపిస్తున్నాయి. ఈ మందులు తక్కువ ధరలకు లభిస్తాయి. అయితే ఆయా మందులపై ముద్రించి ఉన్న ధరకే అమ్ముతున్నారు. దీంతో రోగులపై తీవ్ర భారం పడుతోంది. వ్యాధుల బారిన పడిన వారు ఈ మందులు వాడితే జబ్బు నయం కాకపోవడంతో తిరిగి పలుమార్లు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో మరలా మందుల మార్చి వేరే మందులు అంటగడుతున్నారు. ఆస్పత్రుల వైద్యులకు మెడికల్ షాపుల నుంచి కమీషన్లు వెళుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగికి కావాల్సిన మందులు లేకుంటే... వేరే కంపెనీ మందులను అంటగట్టుతున్నారు. లాభాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఇలాంటి మందులనే అమ్ముతున్నారు.