
సేవా దృక్పథం కలిగి ఉండాలి
శివ్వంపేట(నర్సాపూర్): సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి హేమలత అన్నారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ముగ్ధుంపూర్‌లోని బేతాని సంరక్షణ ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ... వైకల్యం వారి శరీరానికే కానీ మనసుకు కాదన్నారు. మానసిక వికలాంగుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, అవమానించినా, ఇబ్బందులకు గురిచేసిన వారిపై చట్టరీత్యా శిక్షంచబడతారన్నారు. ఆశ్రమంలోని పలువురు అనాథలకు ఆధార్ కార్డులు లేక ప్రభుత్వం నుంచి అందాల్సిన పెన్షన్, ఇతర సదుపాయాలు అందడం లేదని ఆశ్రమ నిర్వాహకుడు సజీవ్ వర్గీస్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
భవితలో న్యాయ విజ్ఞాన సదస్సు
మెదక్‌జోన్: మెదక్ పట్టణంలోని భవిత కేంద్రంలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి ఆర్‌ఎం శుభవల్లి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రపంచ మానసిక ఆరోగ్య సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లాడ్స్ డిప్యూటీ చీఫ్ రామశర్మ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఉప్పలయ్య, సీడీపీఓ కరుణశీల, ప్యానల్ లాయర్ కరుణాకర్ పాల్గొన్నారు.