
తుల్జాభవానీ ఆలయంలో చోరీ
● ఆభరణాలు, హుండీల అపహరణ
● ఆనవాళ్లు సేకరించిన క్లూస్‌టీం
జహీరాబాద్: ఆలయంలో దొంగలు పడి హుండీలు పగులగొట్టి నగదు, ఆభరణాలను దొంగిలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం... మొగుడంపల్లి మండలంలోని ఖాంజమాల్‌పూర్ గ్రామంలో గల శివాజీ మహారాజ్ నిర్మించిన తుల్జాభవానీ మాత ఆలయంలో ఆరు నెలల క్రితం మూడు హుండీలను ఏర్పాటు చేశారు. ఇటీవల నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల జాతర సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, కానుకలు హుండీల్లో వేశారు. హుండీల్లోని డబ్బులు లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ఈ చోరీ జరిగింది. గర్భగుడిలో, ఆలయ ప్రాంగణంలో ఉన్న రెండు హుండీలను దొంగలు గురువారం ర్రాతి ఎత్తుకెళ్లి ఆలయం సమీపంలో పగులగొట్టి నగదు, కానుకలను తస్కరించారు. ఆలయంలోని అమ్మ వారి విగ్రహంపై ఉన్న వెండి కిరీటం, ముఖం, పాదాలతో పాటు శఠగోపం ఎత్తుకెళ్లారు. ఆలయంలోని నంది విగ్రహం వద్ద ఉన్న హుండీని మాత్రం దొంగలు ఎత్తుకెళ్లలేక పోయారు. కాగా ఆ హుండీని పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తుల సమక్షంలో తెరిపించి లెక్కించగా 3.80లక్షలు సమకూరింది. దొంగతనానికి సంబంధించిన సమాచారం అందుకున్న సీఐ శివలింగం, చిరాగ్‌పల్లి ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి ఆలయా న్ని సందర్శించి పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలు ఇటీవల ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.